- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను ... నీ కిచ్చెదను (యెషయా 45:3).
బ్రస్సెల్స్ నగరంలో ఉన్న లేసు దుకాణాలు ప్రపంచ ప్రఖ్యాతి నొందినాయి. వాటిల్లో అతి నాజూకైన ప్రశస్థమైన లేసును అల్లడానికి కొన్ని గదులు ప్రత్యేకంగా ఉంటాయి. ఆ గదులు చీకటిగా ఉంటాయి. ఒక చిన్న కిటికీలోనుండి పడుతున్న కొద్దిపాటి కాంతి మాత్రం నేరుగా కుడుతున్న లేసు మీద పడుతుంటుంది. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క పనివాడే ఉంటాడు. ఆ కాంతి తన చేతులమీద పడేలా కూర్చుని ఉంటాడు. ఈ పద్ధతివల్ల అపురూపమైన లేసు డిజైన్లు తయారవుతాయి. అల్లేవాడు చీకట్లోను, డిజైను వెలుగులోను ఉంటే అందమైన లేసు తయారవుతుందట.
మన జీవితపు అల్లికలో కూడా ఇంతే. కొన్ని సమయాల్లో చీకటి కమ్మేస్తుంది. మనం ఏం చేస్తున్నామో మనకి అర్థం కాదు. మనం అల్లుతున్న డిజైను మనకి కనబడదు. మనకి అనుభవమౌతున్నదాన్లో ఏమీ అందం, ఉపయోగం కనబడవు. అయినా మనం నమ్మకంగా పనిచేస్తూ నిస్పృహకి, అలసటకి తావియ్యక అనుమానం లేక విశ్వాసంలో, ప్రేమలో సాగిపోవాలి. దేవుడు ఎప్పుడూ కనిపెడుతూనే ఉంటాడు. నీ బాధలోనుండి, కన్నీళ్ళలోనుండి అందాన్ని సృష్టిస్తాడు.
దేవుని సంకల్పమనే మగ్గాలు తిరుగుతున్నాయి
ఆయనకిష్టమైన నేత నేస్తున్నాయి
వచ్చే మడతల్నీ, కలిసే నల్లదారాలనీ అయిష్టంగా చూడకు
ఆ నల్లదారాల వెంట బంగారుతీగె ఉంది.
ఉల్లాసంగా అల్లుకుంటూ వెళ్ళు
తుడుచుకో నీళ్ళు నిండిన నీ కళ్ళు
దారాన్ని మాత్రం ఆయనే ఇస్తాడు
ప్రార్థనతో జాగ్రత్తగా అల్లు.