Skip to Content

Day 344 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

2 August 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

మేము శ్రమ పొందినను మీ ఆదరణకొరకును రక్షణకొరకును పొందుదుము; మేమాదరణ పొందినను మీ ఆదరణకొరకై పొందుదుము. ఈ ఆదరణ, మేముకూడ పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమైయున్నది. మీరు శ్రమలలో ఏలాగు పాలివారైయున్నారో, ఆలాగే ఆదరణలోను పాలివారైయున్నారని యెరుగుదుము గనుక మిమ్మునుగూర్చిన మా నిరీక్షణ స్థిరమైయున్నది (2 కొరింథీ 1:6, 7).


నీకేదైనా వేదన, బాధ కలిగినప్పుడు వెంటనే వెళ్ళి కష్టసుఖాలు చెప్పుకోవడానికి నీ పరిచయస్థుల్లో ప్రత్యేకమైన వ్యక్తులున్నారు కదా. వాళ్ళెప్పుడూ ఇంపైన మాటలు, సేదదీర్చే మాటలు పలుకుతుంటారు. నీ అవసరానికి తగిన ఆలోచన చెబుతుంటారు. అయితే గాయపడిన హృదయాలను కట్టడానికి, కారే కన్నీళ్ళని తుడవడానికి సామర్థ్యం వాళ్ళకెలా వచ్చిందో నీకు తెలియదు. అయితే నువ్వు వాళ్ళ గత చరిత్ర తిరగేస్తే తెలుస్తుంది. అందరికంటే వాళ్ళు ఎక్కువ శ్రమలననుభవించి ఉన్నారని. వాళ్ళ ఆనందాల పసిడిపాత్ర వాళ్ళ ఎదుటే భళ్ళున బద్దలైపోయిందొకనాడు. ఆటుపోటులను చవిచూశారు వాళ్ళు. వాడిపోతున్న తీగెల్ని చూశారు. మధ్యాహ్నం వేళనే అస్తమించిన సూర్యుణ్ణి చూశారు. ఇదంతా వాళ్ళని ఈ విధంగా మనుషులకి ఆదరణ కారకులయ్యేలా చెయ్యడంలో సహాయపడింది. దూరదేశాల నుండి వచ్చే ప్యాకెట్లు మురికిమురికిగా ఉండొచ్చు. కాని వాటిలో సుగంధ ద్రవ్యాలుంటాయి. అలానే శ్రమలు భరించరానివిగా ఉండొచ్చు. కానీ వాటి క్రమశిక్షణలో మన ఔన్నత్యం, ఉదాత్త గుణం, పెరిగి ఇతరులకు సహాయపడే నిపుణతను పొందుతాము. శ్రమలలో చిరాకుపడోదు. దాని ద్వారా నువ్వు పొందగలిగినదంతా పొందడం నేర్చుకో. దేవుని చిత్తప్రకారం నీ తరంవాళ్ళకి సేవ చేయగలిగేలా దాని సహాయం తీసుకో.


ఓ సుప్రభాత శుభవేళ ఒక తియ్యని పాట నాలకించాను

మృదుమధుర ప్రార్థనా గీతరవళిలో పులకించాను

ఆ పాట పాడిన స్వరంకోసం అన్వేషించి

శరాఘాతానికి నేలకొరిగిన పక్షిని తిలకించాను.


బాధలో రెక్కలు ముడిచిన ఆ జీవ ఆత్మని చూశాను

విలపించే లోకానికి చిరునవ్వునిచ్చే మధురిమను చూశాను

జీవన మాధుర్యం బాధలో, వేదనలోనే ఉందని తెలుసుకున్నాను

ఆ గాయపడిన ఆత్మ గుచ్చుకున్న బాణంతో పాడుతూ ఉంది.


తెలుసా ప్రేమించి హింసల పాలైన మనిషి గురించి

ఆ చేతులకున్న మేకుల గురించి, ప్రక్కలోని బల్లెం గురించి

కొరడా దెబ్బల గురించి, అపహాస్యాల గురించి

ముళ్ళకిరీటం ధరించి నీ పాపాల కోసం చనిపోవడం గురించి.


యజమానికంటే అధికుడవేం కాదు

నీ ఆత్మలో ముల్లున్నా ఆయన కృప చాలు

నీ జీవితం గాయపడినా ఆయన పిల్లల కోసం పాటుపడు

గుచ్చుకున్న బాణంతో పాడుతున్న గువ్వలాగా.

Share this post