Skip to Content

Day 341 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

యెహోవా సెలవిచ్చునదేమనగా - గాలియే గాని వర్షమే గాని రాకపోయినను, మీరును మీ మందలును మీ పశువులును త్రాగుటకు ఈ లోయ నీళ్ళతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీయులను మీచేతికి అప్పగించును (2రాజులు 3:17-18).


మానవపరంగా ఇది అసాధ్యమే. అయితే దేవునికి అసాధ్యమైనదేదీ లేదు.


చడీ చప్పుడు లేకుండా, కనిపించని వైపునుంచి అసాధ్యమనుకున్న మార్గంలో ఆ రాత్రిలో నీళ్ళు వరదలా వచ్చేసాయి. తెల్లవారినప్పుడు స్వచ్ఛమైన నీళ్ళతో ఆ లోయంతా నిండింది. ఎర్రటి ఆ ఎదోము కొండలు సూర్యకాంతిలో ప్రతిబింబించినాయి. మన అపనమ్మకం ఎప్పుడూ ఏదో ఒక సూచకక్రియ కనబడాలని చూస్తుంటుంది. మతం అంటే అదేదో అలజడి కలిగించే తతంగంలా ఉండాలని చాలామంది అభిప్రాయం. మతపరంగా ఏవేవో మహాత్కార్యాలు జరుగుతూ ఉంటేనే అది సరైన మతం అనుకుంటారు కొందరు. కాని విశ్వాసంలో ఘనవిజయం ఏమిటంటే ఊరకుండి ఆయన దేవుడని తెలుసుకోగలగడమే.


విశ్వాస విజయమేమిటంటే దాటరాని ఒక ఎర్రసముద్రం ఒడ్డున నిలబడి "ఊరక నిలబడి ప్రభువు ఇవ్వబోయే రక్షణను చూడు" అంటున్న దేవుని మాటల్ని వినడమే. "ముదుకి సాగిపో"" అనే మాట వినబడగానే మరేవిధమైన చప్పుడూ, సూచనా లేకపోయినా, మన పాదాలు తడిసినా మొదటి అడుగు సముద్రంలోకి వెయ్యడమే. నడిచిపోతూ ఉంటే సముద్రం రెండుగా చీలి అగాధ జలాల్లోగుండా దారి ఏర్పడుతుంది.


మీరు ఇంతకుముందు ఏదైనా దైవసంబంధమైన మహాత్కార్యాన్నో, స్వస్థతనో కన్నులారా చూసి ఉన్నట్టయితే మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యపరచినది ఆ నిశ్శబ్దమే. ఏ హడావుడీ లేకుండా మౌనంగా మామూలుగా ఆ వింత జరిగిపోయిన తీరేనని నిస్సందేహంగా చెప్పగలను. అక్కడ ఆడంబరంగాని కళ్ళు మిరుమిట్లు గొలిపే సన్నివేశాలు గాని లేవు. మన సర్వశక్తుడైన దేవుని సన్నిధిలో శూన్యమైపోయిన హృదయంతో నిలబడి ఇదంతా చెయ్యడం ఆయనకి ఎంత తేలికైన పనో, ఎవరి సహాయమూ లేకుండా ఎంత సునాయాసంగా చెయ్యగలిగాడో తలుచుకున్నాము.


విశ్వాసం ప్రశ్నించదు, లోబడుతుంది, అంతే. సైనికులంతా కలిసి గుంటలు త్రవ్వారు. నీటిని మాత్రం పైకి తెచ్చేది మానవాతీతమైన శక్తి. ఇది విశ్వాసాన్ని పురిగొల్పే పాఠం.


ఆత్మీయమైన ఆశీర్వాదం కోసం వెదుకులాడుతున్నావా? గుంటలు త్రవ్వండి. దేవుడు వాటిని నింపుతాడు. మనం ఊహించని స్థలాల్లో ఊహించని రీతుల్లో ఈ అద్భుతాలు జరుగుతాయి.


కనిపించేదాన్నిబట్టి కాక విశ్వాసాన్నిబట్టే పనులు చేసే స్థితి రావాలి. వర్షంగాని, గాలి గానీ లేకపోయినా దేవుడు గుంటల్లో నీళ్ళు నింపుతాడని ఎదురు చూడగలగాలి.

Share this post