Skip to Content

Day 340 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

2 August 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము (ప్రకటన 3:11).


జార్జిముల్లర్ ఈ సాక్ష్యాన్నిస్తున్నాడు, "1829 లో నా హృదయానికి యేసుప్రభువు వ్యక్తిగతమైన రాకడ గురించి బయలుపరిచాడు దేవుడు. ప్రపంచం అంతా మారాలని నేను ఎదురుచూస్తూ కూర్చోవడం చాలా పొరపాటని తెలియజేశాడు. ఇది నా హృదయంలో గొప్ప మార్పుని తెచ్చింది. నా హృదయపు లోతుల్లోనుండి నశించిపోతున్న పాపుల కోసం ఓ గొప్ప ఆవేదన బయలుదేరింది. సైతాను ఆధీనంలో చిక్కి నిద్రపోతున్న ప్రపంచాన్ని చూశాను. "యేసుప్రభువు ఆలస్యం చేస్తున్నాడు కదా ఈ లోపల నాకు చేతనైనది నేను చెయ్యాలి. నిద్రమత్తులో ఉన్న సంఘాలను మేలుకొలపాలి."


సంఘం క్రీస్తులో సంగమించే ముందు జరగవలసిన పని ఎంతో ఉంది. అయితే ఈ కాలంలో కనిపిస్తున్న గురుతులని చూస్తుంటే ఇప్పుడే దూత దిగివచ్చి కడవరి బూర ఊదుతాడేమో అన్నట్టు ఉంది. రేపు ఉదయమే క్రీస్తు సీయోను పర్వతం మీదికి దిగివచ్చాడని వార్త వస్తుందేమో, విశ్వ జనీన సామ్రాజ్యాన్ని ప్రకటించాడని తెలుస్తుందేమోనన్నట్టు ఉంది. "చనిపోయిన సంఘాల్లారా, మేలుకోండి. క్రీస్తుప్రభూ దిగి రా, శిథిలమైన దేవాలయమా, కిరీటాన్ని ధరించు. గాయపడిన హస్తాల్లారా, రాజదండాన్ని తీసుకోండి. రక్తం కారే పాదాల్లారా సింహాసనమెక్కండి. రాజ్యం మీదే."


రోజూ పనంతా ముగిసిన

సాయంత్రపు వేళ

సంధ్య కాంతిలో

కుంగిపోతున్న సూర్యుణ్ణి

సంద్రం మీద వింత రంగుల్ని

సంభ్రమంగా చూసే వేళ

గంటలు ప్రశాంతంగా గడిచిపోయి

నా తలపులు నీ మది నిండిన వేళ

పిల్లగాలి గలగలా వీధిలో

నడిచిపోతున్న వేళ


ఈ నిశ్శబ్ద స్తబ్ధతలో

నా అడుగుల సవ్వడి వస్తుందేమో

జాగ్రత్తగా కని పెట్టి చూడు

నింగి మీది తొలి చుక్క

తొంగి చూసిన వేళ

దూరపు మసక మబ్బుల్లాగా

ద్వారం బయట వెలుగు

సమసిపోయే వేళ

తలుపు తెరిచి ఉంచు

ఆ సంధ్య కాంతిలోనే నేనొస్తానేమో

Share this post