- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును (యిర్మీయా 10:23).
సరాళమైన మార్గమున నన్ను నడిపింపుము (కీర్తన 27:11).
చాలామంది దేవుడు తమని నడిపించేలా తమని తాము ఆయన ఆధీనం చేసుకోరు గాని ఆయన్ని నడిపించాలని చూస్తారు. ఆయన తీసుకెళ్ళిన చోట్లకి వెళ్ళరు కాని ఆయనకే దారి చూపించాలనుకుంటారు.
నేనన్నాను "పొలంలో నడుస్తాను"
"ఊళ్ళో నడువు" దేవుడన్నాడు
"అక్కడ మరి పూలేమీ లేవే"
"పూలు లేవు గాని కిరీటముంది."
నేనన్నాను "ఆకాశం నల్లగా ఉంది
అంతా రొద, రణగొణ ధ్వని"
నన్నక్కడికే పంపుతూ అన్నాడు
"అక్కడ పాపం దాగుంది."
"గాలి స్వచ్ఛంగా లేదు
పొగమంచు పట్టేసింది" అన్నాను
"ఆత్మలు రోగాలతో ఉన్నాయి"
ఆయనన్నాడు "పాపాంధకారముంది."
"వెలుగుకి దూరమైపోతాను
మిత్రులుండరు" అన్నాను
ఆయనన్నాడు "ఇప్పుడే కోరుకో
మిత్రులా? నేనా?"
కాస్త గడువియ్యమన్నాను
ఆయనన్నాడు "తేల్చుకోవడం కష్టంగా ఉందా
నీ మార్గదర్శిని అనుసరించి వెళ్లే
పరలోకానికి దారి కష్టంకాదు"
ఉద్యానవనం వంక ఒకసారి చూశాను
ఊరువైపు తిరిగి చూశాను
"కుమారుడా విధేయుడినౌతావా"
అప్పుడన్నాడు "కిరీటం కోసం పూలను వదులుతావా"
ఆయన చేతిలో పడింది చేయి
నా హృదయంలోకి వచ్చాడాయన
ఆ దివ్యకాంతిలో నడిచాను
నిజానికి ఒకప్పుడు భయపడ్డ నేను.