Skip to Content

Day 335 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది (హెబ్రీ 4:9).


అన్ని దిక్కులయందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులనందరిని వారి చేతి కప్పగించియుండెను (యెహోషువా 21:44).


ఆయన దీనులను రక్షణతో అలంకరించును (కీర్తన 149:4).


ప్రఖ్యాత క్రైస్తవ సేవకుడొకాయన తన తల్లి గురించి చెప్తుండేవారు. ఆవిడ చాలా కంగారు మనిషి. ఇలా కంగారుపడడం, ఆందోళన చెందడం పాపమని గంటలకొద్దీ చెప్పి ఆమెను ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. కాని ఆవిడ దిగుళ్ళు తీరలేదు. లేనిపోని బాధలు ఊహించుకుని దిగులుపడేది.


అయితే ఒకరోజు చిరునవ్వుతో ముఖం వెలిగిపోతూ కన్పించింది ఆమె. ఏం జరిగిందని అడిగాడతడు. రాత్రి తనకో కలోచ్చిందని చెప్పిందామె.


కలలో ఆమె ఓ రోడ్డు వెంట వెళ్తున్నది. ఆ దారి వెంటే చాలామంది భారంగా కాళ్ళీడ్చుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళంతా తమ వీపులమీద నల్లటి బరువైన మూటలు పెట్టుకుని నడుస్తున్నారు. చూడడానికి అసహ్యంగా, భయంకరంగా ఉన్న దయ్యాల్లాటి జీవులు వాళ్ళు మోసుకెళ్ళేందుకు ఆ మూటల్ని అక్కడ పారేస్తూ వెళ్తున్నాయి.


మిగతావాళ్ళలానే ఆమె కూడా ఆ అనవసరమైన బరువులు మోసుకుంటూ వెళ్తున్నదట. దయ్యాల బరువులకి కృంగిపోతూ కాసేపటికి తలెత్తి ఒక మనిషిని చూసిందట. అతని ముఖం దయతో వెలిగిపోతున్నది. అతను అటూ ఇటూ పరిగెడుతూ ఆ మనుషుల్ని ఏదో చెప్పి ఓదారుస్తున్నాడు.


చివరికి ఆమె దగ్గరికి కూడా వచ్చాడు. ఆయన తన రక్షకుడని ఆమె గ్రహించింది. తానెంత అలసిపోయానో ఆయనకి చెప్పింది. ఆయన విచారంగా నవ్వి ఇలా అన్నాడు.


"ప్రియకుమారీ, ఈ బరువులు నేనిచ్చినవి కావు. వీటి అవసరం నీకు లేదు. ఇవన్నీ దయ్యం ఇచ్చిన బరువులు. అవి నీ ప్రాణాలు తోడేస్తున్నాయి. వాటిని పడేయ్యి. వాటిని ముట్టుకోకు. అప్పుడు నీ దారీ తేలికౌతుంది. రెక్కలు కట్టుకుని ఎగిరిపోయినంత తేలికగా ఉంటుంది."


ఆమె చేతిని తాకాడాయన. వెంటనే ఆమెలో శాంతి సమాధానాలు చోటుచేసుకున్నాయి. ఆ బరువుల్ని నేలకి విసిరికొట్టి సంతోషంతో కృతజ్ఞతతో ఆయన పాదాలమీద పడబోతుండగా ఆమెకి మెలకువ వచ్చిందట. ఆవిడకున్న దిగుళ్ళన్నీ మటుమాయమైనాయి. ఆ రోజునుంచి ఆమె జీవితాంతం, ఆ కుటుంబం అంతటిలోనూ ఆమె అందరికంటే సంతోషంగా ఉండేది.


రేయిలో సంగీతం నిండిపోతుంది

దినమంతా వేధించిన బాధలు

తోకముడిచి పారిపోతాయి.

Share this post