Skip to Content

Day 328 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

ఊరకుండుడి - నేనే దేవుడనని తెలిసికొనుడి (కీర్తనలు 46:10).


సంగీతం మధ్యలో వచ్చే మౌనం కంటే అందమైన స్వరం ఉందా? తుపానుకి ముందుండే ప్రశాంతతకంటే, ఏదైనా అసాధారణమైన దృగ్విషయం జరగబోయే ముందు అలుముకునే నిశ్శబ్దంకంటే గంభీరమైనది మరొకటి ఉందా? నిశ్చలతలో ఉన్న శక్తికంటే బలంగా హృదయాన్ని తాకే శక్తి ఏదైనా ఉందా?


తన శక్తినుండి తానే తప్పించుకుని అన్ని శబ్దాలనుండి విముక్తి పొందిన హృదయంలో ఊహలకు మించిన దేవుని శాంతి ఉంటుంది. శక్తికి మూలమైన ప్రసన్నత, నిశ్చయత ఉంటాయి. ఏదీ కదిలించలేని శాంతి ఉంటుంది. ఒక దివ్యమైన విశ్రాంతి ఉంటుంది. ప్రపంచం అలాటి విశ్రాంతిని ఇవ్వలేదు. తీసుకోనూ లేదు. ఆత్మ లోతుల్లో ఎక్కడో ఒక చిన్నగది ఉంది. అందులో దేవుడుంటాడు. మనం చెవుల్లో గింగురుమనే శబ్దాలన్నింటినీ వదిలించుకుని దానిలోకి ప్రవేశించగలిగితే ఆ మెల్లని స్వరాన్ని వినగలం.


అతివేగంగా తిరిగే చక్రంలో ఇరుసు దగ్గర ఒక అతి సూక్ష్మమైన బిందువు ఉంది. అక్కడ చలనమేమీ ఉండదు. అలాగే మన హడావుడి జీవితంలో మనం దేవునితో ఉండగలిగిన ఒక చిన్న ప్రదేశం ఉంది. అక్కడంతా ప్రశాంతత, నిశ్శబ్దం. దేవుణ్ణి తెలుసుకోవడానికి ఒకటే మార్గముంది. "మౌనంగా ఉండి" తెలుసుకోవాలి. "దేవుడు తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. లోకమంతయు ఆయన ఎదుట మౌనముగా ఉండును గాక."


"ప్రేమ స్వరూపియైన తండ్రి, చాలాసార్లు మేము నక్షత్రాలు లేని చీకటి రాత్రుళ్ళలో నడిచాము. చుక్కల వెలుగు, సూర్యకాంతి, వెన్నెల మాకు సరిపడేది కాదు. చిమ్మచీకటి మరిక ఎన్నడూ తొలిగిపోదేమోనన్నంత చిక్కగా మా మీద పరుచుకుంది. ఆ చీకటిలో పగిలిన మా హృదయాలను బాగుచేసే స్వరమేదీ వినిపించేది కాదు. కనీసం ఉరుముల ధ్వని వినిపించినా సంతోషించేవాళ్ళమే. ఆ నిశ్శబ్దం మమ్మల్ని నరకయాతన పెట్టింది.


"కాని మధురధ్వనిగల వీణేల స్వరంకంటే మెల్లగా వినిపించే నీ తియ్యని స్వరమే మా గాయపడిన ఆత్మలకు హాయి గొల్పింది. మాతో మాట్లాడినది, "నీ మెల్లని స్వరమే" మేము శ్రద్దతో ఆలకిస్తే వినబడింది. మేము కన్నులెత్తి చూస్తే ప్రేమ కాంతిలో మెరుస్తున్న నీ వదనం కనిపించింది. నీ స్వరాన్ని విని, నీ ముఖాన్ని చూసినప్పుడు ఎండిన చెట్టుకు వర్షపు ధారలు జీవాన్నిచ్చినట్టుగా మా ఆత్మలు సేదదీరాయి."

Share this post