Skip to Content

Day 318 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

గోదుమగింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును (యోహాను 12:24).


నార్తాంప్టన్ లో ఉన్న సమాధుల్లోకి వెళ్ళి డేవిడ్ బ్రెయినార్డ్ సమాధినీ, అతడు ప్రేమించినప్పటికీ పెళ్ళి చేసుకోలేకపోయిన అందాల రాశి జెరూషా ఎడ్వర్డ్సు సమాధినీ చూడండి.


ఆ యువ మిషనరీతోబాటు ఎన్ని ఆశలు, క్రీస్తు కోసం ఎన్ని ఆశయాలు ఆ సమాధిలోకి వెళ్ళిపోయాయో. అతని మిషనరీ సేవ గురించిన జ్ఞాపకాలన్నీ తెరమరుగైనాయి. అయితే తన కుమార్తె జెరూషాను అతనికిద్దామనుకున్న దైవజనుడు జోనాథాన్ ఎడ్వర్డు గారు అతని జీవిత విశేషాలను సంగ్రహించి చిన్న పుస్తకం రాశారు.


ఆ పుస్తకం అట్లాంటిక్ సముద్రం దాటి కేంబ్రిడ్జిలో విద్యనభ్యసిస్తున్న హెన్రీ మార్టిన్ కంటబడింది.


పాపం మార్టిన్! అతనికి వస్తున్న ఉపకారవేతనాన్ని, అతని తెలివితేటల్నీ, విజ్ఞాన సముపార్జననీ ఎందుకు వదిలేశాడు? ఇండియాకు మిషనరీగా వెళ్ళి ఆరోగ్యం పాడైనప్పటికీ లెక్కచేయ్యకుండా ఉత్తరదిశగా ఎందుకు ప్రయాణించాడు? టర్కీ ఎడారి ప్రాంతాలగుండా నల్ల సముద్రందాకా వెళ్ళి, మాడిపోతున్న జ్వరం నుండి కాస్తంత చల్లదనంకోసం ఆ ఎడారి ఇసుకల్లో గుర్రం కళ్ళేలక్రింద తలదాచుకుని ఒంటరి చావు చావవలసిన అగత్యం ఏముంది?


ఎందుకిలా మనుషులు వ్యర్థంగా నశించడం? యవ్వన ప్రాయంలో చనిపోయిన బ్రెయినార్డు సమాధి నుండి, నల్ల సముద్రం ఇసుకలో ఉన్న మార్టిన్ ఒంటరి సమాధిదాకా వేలమంది ఆధునిక మిషనరీలు ఎంతెంతమందో! అందుకని.


ఎడారి ఉందా ఎల్లలులేని సముద్రముందా

ప్రభూ నన్నెక్కడికి పంపుతావు?

నరకవలసిన దేవదారు మ్రాను ఉందా

పగలగొట్టాల్సిన బండ ఉందా?


లేక పొలంలో చల్లేందుకు

పిడికెడు గింజలున్నాయా?

అవి ఫలించి పంట పండితే

పంచి పెట్టడానికి నీ ప్రజలున్నారా?


తండ్రీ ఎడారినైనా సాగరాన్నైనా

చూపించు నాకు పంపించు నీ ఇష్టమైతే

నా తనువు రాలిన తరువాత

తండ్రి నన్ను విశ్వాసుల్లో లెక్కించు.

Share this post