Skip to Content

Day 317 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

2 August 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

తన పిల్లలును తన యింటివారును నీతి న్యాయములు జరిగించుచు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారి కాజ్ఞాపించునట్లు నేనతని నెరిగియున్నాననెను (ఆది 18:19).


బాధ్యతగల వ్యక్తులు దేవునికి కావాలి. అబ్రాహాము గురించి ఏమంటున్నాడో చూడండి. "తన పిల్లలకు అతడు ఆజ్ఞాపిస్తాడని నాకు తెలుసు." ఇది యెహోవా దేవుడు "అబ్రాహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయునట్లు చేసింది." దేవుడు నమ్మదగినవాడు. మనం కూడా అంత నమ్మకస్థులుగా, స్థిరులుగా కావాలని కోరుతున్నాడు. విశ్వాసమంటే సరిగ్గా ఇదే.


తన ప్రేమ భారం, తన శక్తి, తన నమ్మదగిన వాగ్దానాల భారం ఉంచడం కోసం తగిన మనుషుల కోసం దేవుడు వెదుకుతున్నాడు. మనం తగిలించే ఎంత బరువునైనా తన వైపుకు ఆకర్షించుకోగలిగే యంత్రాలు ఆయన వద్ద ఉన్నాయి. కాని దురదృష్టవశాత్తూ మన ప్రార్థనలను దేవుని యంత్రాలకు కలిపే ఇనుప తీగే బలహీనంగా ఉంది. అందుకే దేవుడు మనకు స్థిరత్వాన్నీ, దారుఢ్యాన్నీ చేకూర్చడానికి విశ్వాస జీవితంలో శిక్షణనిస్తున్నాడు. మన పాఠాలను సరిగ్గా నేర్చుకొని స్థిరులై ఉందాము.


శ్రమను నువ్వు తట్టుకోగలవని దేవునికి తెలుసు. అలా కాదనుకుంటే ఆయన ఆ శ్రమను నీ మీదికి పంపించేవాడు కాదు. శ్రమలు ఎంత తీవ్రమైనవైనా ఆయన మీద నీకున్న నిరీక్షణే వాటికి జవాబు. దేవుడు మన శక్తిని ఆఖరు అంగుళం వరకు కొలిచిన తరువాతే దానికి పరీక్ష పెడతాడు. ఆయనలో మనకున్న శక్తిని మించిన పరీక్ష ఎప్పుడూ మనకు రాదు.

Share this post