Skip to Content

Day 315 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

2 August 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

గడ్డికోసిన బీటిమీద కురియు వానవలెను భూమిని తడుపు మంచి వర్షమువలెను అతడు విజయము చేయును (కీర్తనలు 72:6).


గడ్డి కోయడాన్ని గురించి ఆమోసు రాసాడు. మన రాజు దగ్గర చాలా కొడవళ్ళు ఉన్నాయి. ఆయన నిత్యమూ తన గడ్డిభూముల్ని కోస్తున్నాడు. ఆకురాయి మీద కొడవలి పదును పెడుతున్న సంగీతానికి పరపరా గడ్డి కోస్తున్న శబ్దాలు తోడౌతున్నాయి. పచ్చని గడ్డిపరకలు, చిన్న చిన్న రంగు రంగుల పూలు ఇంత క్రితమే కళకళలాడుతూ ఉన్నాయి. ఇప్పుడు తెగి కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. మానవ జీవితంలో కూడా బాధ అనే కొడవలి, నిరాశ అనే కత్తిరింపు రాకముందు మనం చాలా ధైర్యంగా, దర్జాగా నిలబడి ఉంటాం.


అయితే పట్టు తివాచీలాంటి పచ్చిక పెరగాలంటే ప్రతిదినం ఆ గడ్డిని కోస్తూ ఉండడమే మార్గం. దేవుని కొడవలి మనమీదికి రానిదే మనలో వాత్సల్యం, సానుభూతి, గంభీరత రావు. దేవుని వాక్యం ఎప్పుడూ మనిషిని గడ్డితోను, అతని మహిమను గరిక పువ్వుతోను పోలుస్తూ ఉంటుంది. గడ్డి కోసినప్పుడు, దాని లేత పరకలన్నీ తెగిపడినప్పుడు, పూలు పూసినచోట అంతా సర్వనాశనం తాండవమాడినట్టు అనిపించినప్పుడు అదే మెత్తగా, వెచ్చగా వాన చినుకులు పడవలసిన సమయం.


"ఓ హృదయమా, నిన్ను కూడా దేవుడు కత్తిరించాడు. చాలాసార్లు నీ రాజు తన కొడవలితో నీ దగ్గరకు వచ్చాడు. కొడవలికి భయపడకు. వెంటనే వర్షం కురుస్తుంది."


దౌర్భాగ్యపు మనసులో

విచారపు కెరటాలు పొంగినై

రేపు అనేది నిరాశ నిండిన నిశీధి అయ్యింది

తుపాను అదుపు లేకుండా ఎగిసింది


ఇహలోకపు సౌఖ్యాలు

నోటికి చేదైనాయి

ఆశలు పేలవంగా కూలిపోతూ

వ్యధ నిండిన మదిని వెక్కిరించాయి


కుములుతున్న మదిలో నిట్టూర్పును

మదిలో నిండిన శూన్యాన్ని

ఎవరాపగలరు ఎవరు మాపగలరు

శాంతిని ఎవరు నింపగలరు


ఎవరి హృదయం గాయపడి పగిలిపోయిందో

ఎవరు ముళ్ళకిరీటధారియై సిలువ మోశారో

మన కోసం తన జీవం ఎవరు ధారపోశారో

వారి ప్రేమ వాక్కులే శాంతి ప్రదాతలు


పరమ వైద్యుడా తేలికచెయ్యి మా భారాలు

శాంతిని నీ శాంతిని మాలో స్థాపించు

తెల్లారేదాకా నీతో తిరగనీ

నీడలు పోయేదాకా మాకు నీడగా ఉండు.

Share this post