Skip to Content

Day 312 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

2 August 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని, ప్రార్థనచేయుటకు ఒక కొండ యెక్కెను. ఆయన ప్రార్ధించుచుండగా ఆయన ముఖరూపము మారెను; ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసేను . . . వారు మేలుకొనినప్పుడు, ఆయన మహిమను. . . చూచిరి (లూకా 9:28-32).


నీ కటాక్షము నా యెడల కలిగిన యెడల.. దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము (నిర్గమ 33:13).


యేసు తన ముగ్గురు శిష్యులను దూరంగా కొండమీదికి తీసుకొనిపోయి వారిని తనతో సన్నిహిత సహవాసంలోకి తీసుకువచ్చాడు. వారు యేసు మహిమను చూశారు. అక్కడ ఉండడం వారికెంతో శ్రేష్టతరం. తమ ప్రభువుతో ఒంటరిగా కొండమీద ఉన్నవారికి పరలోకం ఇంకెంతో దూరం ఉండదు.


ఏకాంత ప్రార్థనలో, ధ్యానంలో తెరిచి ఉన్న పరలోకపు ద్వారాలను చూడలేని వారెవరుంటారు? ప్రభువుతో ఏకాంత సేవలో ఉన్నప్పుడు శ్వేత కెరటంలాగా లేచే అనుభూతుల్ని, పరలోకపు అనుభవాల వాసనల్నీ రుచి చూడని వారెవరుంటారు?


మన ప్రభువు తన శిష్యులతో ఏకాంతంగా మాట్లాడడానికి రకరకాల సమయాలనూ, స్థలాలనూ ఎన్నుకుంటూ ఉంటాడు. ఒకసారి హెర్మోను కొండమీద, చాలాసార్లు ఒలీవ కొండమీద ఇలా ఎన్నెన్నో స్థలాలకు తీసుకెళ్తూ ఉండేవాడు. ప్రతి క్రైస్తవుడికీ ఒలీవ కొండ అనుభవం ఉండాలి. మనలో చాలామంది పట్టణాలలో నివసించేవాళ్ళం. అస్తమానమూ అనేక ఒత్తిడులకు గురవుతూ ఉంటాము. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పొద్దుపోయేదాకా మనం ఈ సుడిగాలిలోనే తిరుగాడు తుంటాము. ఈ గందర గోళంలో ధ్యానపూర్వకమైన ఒక్క ఆలోచనకీ, ప్రార్థనకీ, మనసు విప్పి దేవునితో సంభాషించడానికి సమయమెక్కడుంది?


బబులోను విగ్రహారాధనలు, అర్చనల గోల మధ్య దానియేలుకు గదిలో ఒక ఒలీవ కొండ ఉంది. యెప్పాలోని ఇంటి పైకప్పుమీద పేతురుకు ఒలీవ కొండ ఉంది. మార్టిన్ లూథర్ కు విట్టెన్ బర్గులోని ఒక మేడగదిలో ఈ ఏకాంతం దొరికింది. దాన్ని ఇప్పటికీ పవిత్రస్థలంగా ఎంచుతారు.


ఒకసారి డాక్టర్ జోసఫ్ పార్కర్గారన్నారు "మనం తిరిగి మన దర్శనాలలోకి, పరలోకపు దృశ్యాలను తొంగిచూసే సమయాల్లోకీ, ఉన్నతమైన మహిమ లోకాలనూ, సమృద్ది జీవితాన్ని అనుభవించగలిగే తాదాత్మ్యంలోకీ వెళ్ళలేకపోతే మన మతానికి నీళ్ళిదులుకోవలసిందే. మన బలిపీఠం ఒక రాయిలాగా మిగిలిపోతుంది. దాన్ని పరలోకపు అగ్ని దర్శించడం మానుకుంటుంది." ప్రపంచానికి నేడు కావలసిందేమిటంటే దేవుణ్ణి చూసిన మనుషులు.


దేవునికి సన్నిహితంగా రండి. తప్పటడుగులు వేసే పేతురునూ, తమ బోధకుడినీ, ఆయన ఉద్దేశాలనూ అర్థం చేసుకోవడానికి మాటిమాటికీ విఫలులైన యోహాను, యాకోబులనూ యేసు ఏకాంతంలోకి తీసుకువెళ్ళాడు. మిమ్మల్ని ఈరోజు ఆయన ఏకాంతంగా కొండమీదికి తీసుకెళ్తాడేమో. ఎందుకు తీసుకెళ్ళకూడదు? మిమ్మల్ని మీరే తగ్గించేసుకుని "ఆ, అలాంటి ఆశ్చర్యకరమైన దర్శనాలు, దేవుని వాక్కులు వచ్చేది ఎవరో కొద్దిమంది భక్తవరేణ్యులకే" అనకండి. మీకోసం కాదని ఎక్కడా రాసిలేదు.

Share this post