- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను (ప్రకటన 3:19).
దేవుడు తన సేవకుల్లో అతి ప్రధానులైన వాళ్ళను ఎన్నుకుని శ్రమల్లో అతి ప్రధానమైన వాటిని ఎంచి వారిమీదికి పంపిస్తాడు. దేవునినుండి ఎక్కువ కృప పొందినవాళ్ళు, ఆయనద్వారా వచ్చే ఎక్కువ కష్టాలను భరించగలిగి ఉంటారు. శ్రమలు విశ్వాసీని ఏ కారణమూ లేకుండా అంటవు. వాటిని కేవలం దేవుడే అతని కోసం నిర్దేశించి పంపించాడు. దేవుడు వ్యర్థంగా తన విల్లును ఎక్కుపెట్టడు. ఆయన వదిలిన ప్రతి బాణమూ ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని సాధిస్తుంది. దాని గురికి తప్ప మరెక్కడా అది నాటుకోదు. విశ్వాసులంగా మనం తొణకకుండా నిలబడి శ్రమలను అనుభవించడం ఎంతో మహిమకరం.
నా కంట నీరు లేకుంటే
నా బ్రతుక్కి అలసటే లేకుంటే
ఆయనిచ్చే విశ్రాంతితో నాకేం పని?
సమాధులు నా కళ్ళదుట లేకుంటే
బ్రతుకంతా ఒక భావంలేని స్వప్నమేగదా
నా కన్నీళ్ళు నా ఆలసట నా సమాధులు
అన్నీ ఆయన దీవెనల వాహనాలు
వాటికి కష్టాలని పేరు కాని
నా దేవుని ప్రేమ గుర్తులే కదా అవి?
ఆత్మలో గొప్ప ఆవేదన జ్వాలలు చెలరేగిన క్రైస్తవులే దేవుని బడిలో ఎక్కువ నేర్చుకున్న విద్యార్థులు. క్రీస్తును ఎక్కువగా తెలుసుకోవాలని నువ్వు ప్రార్థిస్తున్నట్టయితే, ఆయన నిన్ను ఎడారిలోకో, లేక బాధల కొలిమిలోకో తీసుకువెళ్తే ఆశ్చర్యపడకు.
"దేవా, సిలువను నా నుండి తీసెయ్యడం ద్వారా నన్ను శిక్షించకు. నేను నీ చిత్రానికి లోబడేలా చేసి, నీ సిలువను ప్రేమించేలా ప్రేరేపించి నన్ను ఆదరించు. నిన్ను నిండు మనస్సుతో సేవించడానికి సాధనమేదైనాసరే, అది నాకు దయచెయ్యి. నాలో నువ్వు నీ నామాన్ని మహిమపరచుకునే ఆ గొప్ప కృపను నీ చిత్తం చొప్పున నాకు అనుగ్రహించు."