- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
ఆయన సమాధానము కలుగజేయును (యోబు 34:29).
తుపాను ఊపేసే వేళ సమాధానం! ఆయనతో మనం సముద్రాన్ని దాటుతున్నాము. సముద్రం మధ్య తీరానికి దూరంగా చీకటి ఆకాశం క్రింద హటాత్తుగా పెద్ద తుపాను రేగింది. నింగీ, నేల ఏకమై ఎదురు నిలిచినట్టు హోరుగాలి, వర్షం, లేచే ప్రతి అలా మనల్ని మింగేసేటట్టు ఉంది.
అప్పుడాయన నిద్ర లేస్తాడు. గాలిని, అలలను గద్దిస్తాడు. విలయతాండవం చేసే ప్రకృతిని తన చెయ్యి చాపి నిమ్మళింపజేస్తాడు. గాలివేసే వికృతమైన ఈలలకు పైగా, పడి లేచే పెనుకెరటాల హోరుకంటే బిగ్గరగా ఆయన స్వరం వినిపిస్తుంది "ప్రశాంతంగా ఉండండి."నీకా స్వరం ఎప్పుడైనా వినిపించిందా? వెంటనే గొప్ప ప్రశాంతత అలుముకుంటుంది. ఆయన సమాధానం కలుగజేస్తాడు. మనకై మనం ఓదార్చుకోలేని సమయాల్లో తన సమాధానాన్ని మనకిస్తాడు.మన సంతోషాలు, మన ఆదర్శాలు, ఆశయాలు వీటన్నిటిని చూసుకుని మనం తృప్తి పడుతుంటాము. కాని ఆయన కృప చొప్పున మనం వీటన్నిటికీ ఆయనకీ ఉన్న తేడా గుర్తించగలిగేలా మనకి సహాయం చేస్తాడు. మనల్ని చేరదీసి తాను మనతోనే ఉన్నాడన్న ధైర్యాన్ని కలిగిస్తాడు. మన మనస్సులోను, హృదయంలోను అంతులేని నిశ్చలత పరచుకుంటుంది. సమాధానాన్నిస్తాడాయన.
ఎవరి పాదాలు బాధల బాటను నడిచాయో
ఎవరి హస్తాలు మన కలతలను మోసాయో
అన్నా! ఆయనే మనకి శాంతినిస్తాడు
మన నష్టాన్నే లాభంగా చేస్తాడు.
నీ దీవెనలన్నిటిలో ఆదరణలన్నిటిలో
ప్రభూ, నే కోరుకునేదొక్కటే
మోగుతున్న యుద్ధభేరుల మధ్య
నీ స్వరం వినాలనీ, విశ్రాంతి పొందాలనీ
పిల్లగాలులు వీచే విశ్వాసపు శుభదినాన
భయాలు నా ప్రశాంతతను భంగపరచవు
చీకటి మూసిన దారుల్లో చేతిలో చేతితో
నీ వెంట సాగితే శోకాలు నన్నంటవు
చీకట్లు సమసే ఉదయం వస్తుంది
ఇది తెలిసి ఆశతో ఎదురు చూస్తాను
అశాంతిగా మార్చగలవారెవరు
నువ్విచ్చిన నిత్యశాంతిని?