Skip to Content

Day 307 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

2 August 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

చెట్లులేని మిట్టలన్నిటిమీద వారికి మేపు కలుగును (యెషయా 49:9).


ఆట బొమ్మలు, చేతిగాజులు తేలికగా లభిస్తాయి. కాని విలువైన వస్తువులు కొనాలంటే కష్టపడాలి. ఉన్నతాధికారాలు రక్తం ధారపోసిన వారికే దక్కుతాయి. నీ రక్తమిచ్చి ఎంత ఎత్తైన స్థానాన్నైనా కొనుక్కోవచ్చు. పరిశుద్ధ శిఖరాలను చేరడానికి షరతు ఇదే. నిజమైన శూరత్వం ఏమిటంటే తన రక్తాన్ని ఇతరులకోసం ఒలికించడమే. జీవితంలో అత్యుత్కృష్టమైన వ్యక్తిత్వపు విలువలు గాలివాటుగా మన పాదాల దగ్గర వచ్చి పడవు. గొప్పవాళ్ళ హృదయాల్లో గొప్ప దుఃఖాలు ఉంటాయి.


చేదు నిజాలు చెత్తకాగితాలు

గాలికి ఎగిరొచ్చే గడ్డి పరకలు

విలువైన నిజాలనైతే

ధర పెట్టి కొనుక్కోవాలి.


గొప్ప నిజాల కోసం పోరాడాలి

కలలో దొరికేవి కావని

ఆత్మలో సంఘర్షణలో శోధనలో

ఎదురు దెబ్బలో దొరికేవని.


శోకాలు బాధలు శోధించే రోజున

బలమైన దేవుడు తన చెయ్యి చాపి

కరడుగట్టిన గుండెలోతుల్ని దున్ని

పాతుకుని ఉన్న సత్యాలని పైకితీస్తాడు.


కలత చెందిన ఆత్మలో కార్చిన కన్నీళ్ళలో

దున్నిన భూమిలో దండిగా మొలకెత్తిన

పంటలాగా సత్యం సాక్షాత్కరిస్తే

ఆ కన్నీళ్ళు వ్యర్థం కావని తెలుస్తుంది.


దేవుడు మన విశ్వాసం ఉపయోగించవలసిన పరిస్థితుల్లోకి మనలను నడిపిస్తున్న కొద్దీ ఆయన్ను తెలుసుకొనే అవగాహన శక్తి మనలో ఎక్కువైతూ ఉంటుంది. కాబట్టి శ్రమలు మన దారికి అడ్డం వచ్చినప్పుడల్లా దేవుడు మన గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడని మనం తెలుసుకుని సహాయం కోసం ఆయనమీదే ఆధారపడుతూ ఆయనకు కృతజ్ఞతా స్తుతులను అర్పించాలి.

Share this post