Skip to Content

Day 306 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

సంఘమయితే . . . ప్రార్థన చేయుచుండెను (అపొ.కా. 12:5).


ప్రార్థన మనలను దేవునితో కలిపే లింకు వంటిది. ఇది అగాధాలన్నిటినీ దాటించే వంతెన. ప్రమాదాలు, అవసరాలు అనే గోతుల మీదుగా మనలను అది దాటిస్తుంది.


ఇక్కడ అపొస్తలుల కాలంనాటి సంఘం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. పేతురు చెరసాలలో ఉన్నాడు. యూదులు విజయోత్సాహంతో ఉన్నారు. హేరోదు ఆ హతసాక్షుల వధాస్థలం దగ్గర అపొస్తలుడి రక్తం ఒలికించడానికి ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూస్తున్న మృగంలాగా ఉన్నాడు. అయితే దేవుని సన్నిధికి ప్రార్థన ఎడతెగక చేరుతూనే ఉంది. అప్పుడు జరిగిందేమిటి? చెరసాల తెరుచుకుంది. పేతురు విముక్తుడయ్యాడు. యూదులు తికమకపడ్డారు. దుష్టుడైన రాజు పురుగులు పడి చనిపోయాడు. దేవుని వాక్యం జయోత్సాహంతో ఉరకలు వేసింది.


మనకు ఉన్న ఈ దివ్య ఖడ్గానికి ఉన్న శక్తి మనకు తెలుసా? ఈ ఆయుధాన్ని విశ్వాసంతో, మనకిచ్చిన అధికారంలో వాడడానికి మనకు సాహసం ఉన్నదా? దేవుడు మనలను పరిశుద్ధమైన ధైర్యంలోను, దివ్యసాహసంలోను బాప్తిస్మమిస్తాడు. ఆయనకు గొప్పవాళ్ళు అక్కరలేదు. తమ దేవుడి గొప్పదనాన్ని నిరూపించే మనుషులు కావాలి.


మీ ప్రార్థనల్లో అవిశ్వాసం వల్లగాని, ఆయన శక్తి ఎంతటిదో మనకు తెలుసునన్న భ్రమలోగాని, ఆయన్ను తక్కువగా అంచనా వేసి ఆయన ఇవ్వగలిగిన దానికి పరిధిలను ఏర్పరుస్తున్నామేమో. మనం అడిగిన దానికంటే, ఆలోచించగలిగినదానికంటే అతీతమైన వాటిని ఇస్తాడని ఎదురు చూడండి. నువ్వు ప్రార్ధిస్తున్నప్పుడల్లా ముందుగా మౌనముద్ర వహించి ఆయన మహిమలో ఆయన్ను ఆరాధించు. ఆయన ఏమేమి చెయ్యగలడో ఊహించు. క్రీస్తు నామంలో ఆయనకెంత సంతోషమో అర్థం చేసుకో. శ్రేష్టమైన విషయాల కోసం ఎదురు చూడు.


మన ప్రార్థనలే దేవుడి అవకాశాలు.


నువ్వు దుఃఖంలో ఉన్నావా? ప్రార్థన నీ శ్రమలను మధురంగా, శక్తి పూరితంగా చేస్తుంది. ఉల్లాసంగా ఉన్నావా? నీ ఉల్లాసానికి ప్రార్థన ఉత్సాహ పరిమళాన్ని కలుపుతుంది. బయటినుంచో, లోపలినుంచో శత్రువులు నిన్ను బెదిరిస్తున్నారా? ప్రార్ధన నీ కుడిచేతి వైపున దేవదూతను నిలబెట్టగలదు. ఆ దూత తాకితే చాలు, బండరాయి పిండి అయిపోతుంది. అతడి ఓరచూపులో సైన్య సమూహాలు కూలిపోతాయి. దేవుడు ఏమేమి చెయ్యగలడో అవన్నీ నీ ప్రార్ధన నీకు చెయ్యగలదు. నీకేం కావాలో అడుగు.


పెనుగులాడే ప్రార్థన అద్భుతాలు చెయ్యగలదు

లోతైన అగాథాల్లోంచి లేవనెత్తగలదు

ఇనుప తలుపులగుండా ఇత్తడి కిటికీలగుండా

దూసుకుపోయేలా చెయ్యగలదు.

Share this post