Skip to Content

Day 301 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

2 August 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

అయినను దేవుడు కరుణాసంపన్నుడైయుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించేను . . . క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడ లేపి, పరలోకమందు ఆయనతోకూడ కూర్చుండబెట్టెను (ఎఫెసీ 2:4-7).


క్రీస్తుతోకూడా పరలోకంలోనే మన అసలైన స్థానం. అయితే ఈ అనుభవాన్ని పొందలేనివాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ పరలోకంలో తాము కూర్చోగలగడం అసలు తమకు సాధ్యమేనని ఎంతమందికి తెలుసు?


ఆదివారాలు ఈ పరిశుద్ధ స్థలాలను ఒక్కసారి దర్శించడం, ఆత్మావేశం ఆవహించిన సమయాల్లో అలాటి స్థలాలు అందుబాటులో ఉన్నట్టు అనుకోవడం, ఇదే ఈ పరలోకంలో కూర్చునే అనుభవం అనుకుంటారు కొందరు. కాని ప్రతిరోజూ, రోజంతా అక్కడే కూర్చుని ఉండడమన్నది వేరే విషయం. ఇది ఆదివారాలకే కాదు, అన్ని రోజులకి వర్తిస్తుంది.


తొణకని మనస్తత్వం మన దైనందిన కార్యక్రమాలు సక్రమంగా చేసుకుపోవడానికి ఎంతో ముఖ్యం. మనసులో అల్లకల్లోలంగా ఉంటే మన ఆత్మకార్యాలకు కలిగే ఆటంకం అంతా ఇంతా కాదు.


తొణగకుండా ఉండగలగడంలో గొప్ప శక్తి ఉంది. ఒక భక్తుడు ఇలా అన్నాడు "నిరీక్షణ ఉంచి, మౌనంగా ఉన్నవాడికి అన్నీ లాభసాటిగా జరుగుతాయి." ఈ మాటలలో అంతులేని అర్థం ఉంది. ఈ సత్యాన్ని మనం వంటబట్టించుకోగలిగితే మనం చేసే పనుల ధోరణి అంతా మారిపోతుంది. అసహనంతో పెనుగులాడే బదులు అంతరంగంలో క్రీస్తు యెదుట మౌనంగా కూర్చుని ఉంటే, ఆయన ఆత్మశక్తి మనం తల పెట్టిన కార్యాన్ని సాధించేలా చేస్తుంది. ఈ మౌన శక్తి పనిచేసే విధానాన్ని మనం చూడలేము. కాని అది ఊహాశక్తితో ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుందని మాత్రం తెలుసుకోవాలి. దానిలో కొట్టుకుపోయేలా నీ ఆత్మను నిశ్చలంగా ఉంచుకోగలిగితే ఆ శక్తి నీకు అనుకూలంగా పనిచేస్తుంది.


విశ్రాంతి స్థలం ఉంది

తుపాను నడిబొడ్డులో

ఆ నిశ్శబ్దంలో పసిపాప నిద్రపోతాడు

మహాపవన సుడిగుండపు కేంద్ర స్థానంలో

వెంట్రుక కూడా కదలని నిశ్చలత ఉంది.


ప్రతి పరిస్థితిలోను దేవునిలో ప్రశాంతంగా క్షేమంగా ఉండగలగడం నేర్చుకోవడమే నీ ధర్మం.

Share this post