Skip to Content

Day 298 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

2 August 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును (యోహాను 16:24).


అమెరికా సివిల్ వార్ లో ఒక బ్యాంకు అధికారికి ఏకైక కుమారుడైన ఒకతను యూనియన్ సైన్యంలో చేరాడు. తండ్రి అతణ్ణి చేరడానికి అనుమతి ఇచ్చినప్పటికీ ఆ నిర్ణయం తీసుకోవడం అతనికి చాలా బాధాకరమైనది.


తన కుమారుడి వయస్సు ఉన్న సైనికులెవర్ని చూసినా తన కుమారుణ్ణి చూసినట్టె ఉండేది. అతడు తన బ్యాంకు వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేస్తూ వికలాంగులైన సైనికుల కోసం తన డబ్బంతా ఇచ్చేస్తూ ఉండేవాడు. అందుకు అతని స్నేహితులు అభ్యంతరపెడుతూ ఉండేవారు. అతడు కొంతకాలం తరువాత వాళ్ళ మాటలు లక్ష్యపెట్టి ఇకపై అలాగా చెయ్యకూడదని నిర్ణయించుకున్నాడు.


ఈ నిర్ణయం జరిగిపోయిన తరువాత ఒకరోజున అతని బ్యాంకుకు ఒక సైనికుడు వచ్చాడు. అతని యూనిఫారం వెలిసిపోయి మురికిగా ఉంది. అతని శరీరంపై గాయపు మచ్చలున్నాయి.


ఆ సైనికుడు తన జేబులోనుండి ఏదో తీస్తూ ఉంటే తన సహాయం అడగడానికి వచ్చాడనుకొని ఆ బ్యాంకు అధికారి అన్నాడు "అబ్బాయ్, ఈరోజు నీకేమీ సహాయం చెయ్యలేను. చాలా బిజీగా ఉన్నాను. మీ ఆఫీసర్ల దగ్గరకు వెళ్ళు. వాళ్ళు నీ సంగతి చూస్తారు"


ఆ సైనికుడికి ఏమీ అర్ధం అయినట్టు లేదు. అతడు తన జేబులు తడిమి ఒక మట్టి కొట్టుకుపోయిన కాగితాన్ని బయటకు తీశాడు. దానిమీద పెన్సిలుతో కొన్ని మాటలు ఉన్నాయి "నాన్నగారూ. ఇతడు యుద్దంలో గాయపడిన నా స్నేహితుడు. కొంతకాలం ఆసుపత్రిలో ఉన్నాడు. ఇతణ్ణి నాలాగే చూసుకోండి. ఇట్లు మీ కుమారుడు - చార్లీ"


బ్యాంకు అధికారి చేసుకున్న నిర్ణయాలన్నీ ఒక్క క్షణంలో మాయమయ్యాయి. ఆ సైనికుడిని తన భవనానికి తీసుకెళ్ళాడు. చార్లీ ఉండే గదిలో అతణ్ణి ఉంచాడు. భోజనం బల్లదగ్గర చార్లీ కూర్చునే కుర్చీలో కూర్చోబెట్టాడు. మంచి ఆహారం, విశ్రాంతి, తాను చూపించే ప్రేమ మూలంగా అతని ఆరోగ్యం తిరిగి వచ్చేదాకా ఉంచుకుని తిరిగి యుద్దానికి పంపించాడు.


"నేను చేయబోవుచున్న దానిని నీవు నిశ్చయముగా చూసెదవు" (నిర్గమ 6:1),

Share this post