- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించియున్నాను (యెషయా 41:15).
అయిదు డాలర్లు విలువ చేసే ఉక్కుముక్కను గుర్రపు నాడాలుగా చేస్తే అది 10 డాలర్ల ధర పలుకుతుంది. దాన్ని పదునైన సూదులుగా చేస్తే 350 డాలర్లు అవుతుంది. చిన్న కత్తి బ్లేడులుగా చేస్తే 32,000 డాలర్ల విలువ చేస్తుంది. గడియారాల స్ప్రింగులుగా చేస్తే 2,50,000 డాలర్ల విలువ చేస్తుంది. ఇంత విలువైనదిగా రూపొందాలంటే ఆ ఉక్కుముక్క ఎన్ని అవస్థలు పడాలో ఊహించండి. దానిని ఎన్నిసార్లు సుత్తులతో కొడితే, ఎన్నిసార్లు కొలిమిలో వేసి కాలిస్తే, ఎన్నిసార్లు రుద్ది పదును పెడితేనో అంత విలువ పెరిగింది.
ఈ ఉపమానం మనలను మౌనంగా, నిశ్చలంగా, దీర్ఘశాంతంతో శ్రమను సహించడానికి ప్రేరేపించాలి. ఎక్కువ శ్రమ పడినవాళ్ళ ద్వారా ఎక్కువ ఘనకార్యాలు జరుగుతాయి. బాధ ద్వారా దేవుడు మననుండి గొప్ప ఫలితాన్ని రాబడుతున్నాడు. మనద్వారా ఆయనకు మహిమ, ఇతరులకు ఆశీర్వాదం కలుగుతాయి.
నీ చిత్తం నెరవేర్చడానికి
నిశ్చలంగా ఉండడానికి
నీ సేవకుడికి సహనం ప్రసాదించు
ఏ ఇతర ఆధారమూ లేక
నీపైనే ఆధారపడే ధైర్యాన్ని అనుగ్రహించు.
నా దారినుండి తొలగిపోని జ్ఞానాన్ని పంపించు
బాధను ప్రసాదించే నీ ప్రేమనూ
దాన్ని తొలగించే నీ దయనూ
అర్థం చేసుకొనే శక్తి నాకు కలిగించు.
జీవితం అంతుబట్టనిది. మనకోసం దేవుడు మరో శాశ్వత ప్రపంచాన్ని సిద్దపరుస్తున్నాడని మనం నమ్మకపోతే ఇదంతా అయోమయంగా ఉంటుంది. ఇక్కడ హోరశ్రమలు పొందినవాళ్ళకు ప్రత్యేకమైన స్థానాలు ఉంటాయని తెలియకపోతే ఇవేవీ అర్థం కావు.
పదునైన బ్లేడులు ఉన్న యంత్రంలోనుంచి అతి సున్నితమైన వస్తువులు తయారవుతాయి.