Skip to Content

Day 296 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

2 August 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

ఆయన చేసిన శుభవాగ్దానములో ఒక మాటైన తప్పిపోయినది కాదు (1 రాజులు 8:56).


జీవితపు భారమైన కదలికలో దేవుని నుండి వచ్చిన ప్రతి నిరాకరణ వెనుక ఏదో ఒక కారణం ఉన్నదని ఒకరోజున మనం తెలుసుకుంటాం. ఏదో విధంగా మన అవసరానికి తగినట్టుగా ఆయన సమకూరుస్తాడు. చాలాసార్లు మనుషులు తమ ప్రార్థనలకు జవాబు రాలేదని దిగులుపడుతూ తల బద్దలు కొట్టుకుంటూ ఉంటే దేవుడు మరింత ధన్యకరంగా ఆ ప్రార్థనలకు ప్రతిఫలమిస్తున్నాడు. దీనికి సంబంధించిన సూచనలు అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటాయి గాని పూర్తిగా అర్థమయ్యేది భవిష్యత్తులోనే.


దేవుడు నీ ప్రార్థనకి సమ్మతిస్తే

నీలాకాశంలో వెచ్చని ఎండ తోడౌతుందీ

విశాలపధం పిలుస్తుంది

బాటవెంట పక్షులు పాటలు పాడుతాయి


దేవుడు నీ ప్రార్థన తృణీకరిస్తే

మబ్బులు దట్టంగా పట్టి చీకటి కమ్మితే

దారికడ్డంగా బండరాళ్ళు పెడితే

చలిగాలులు వీచి వణికిస్తే

ఇవన్నీ దేవుడు పంపిన పరీక్షలే

ప్రయాణం ముగిసి తండ్రి గృహానికి చేరుతాము.


తొందరపాటు లేకుండా ప్రభువు కోసం ఓపికతో కనిపెట్టే విశ్వాసం కోసం ఆశించాలి. యేసుప్రభువు బయలుపరిచే రహస్యాల కోసం కనిపెట్టాలి. దేవుడు నూరంతలు తిరిగి చెల్లించకుండా ఎప్పుడైన మన దగ్గర ఏమన్నా తీసుకున్నాడా? కాని ఈ తిరిగి చెల్లించడం అన్నది వెంటనే జరగకపోవచ్చు. అయితే ఏమిటి? దేవుడు ఏదన్నా చెయ్యాలనుకుంటే, కాలాతీతమైపోయే ప్రమాదం లేదు కదా? ఈ అల్పమైన ప్రపంచాన్ని మించి పరలోకంలో కూడా ఆయన అధికారం చెల్లుతుంది కదా? మన సమాధి ద్వారం తెరుచుకున్నాక మనం ప్రవేశించేది ఆయన రాజ్యంలోకే గదా?


అలాకాక మనకు సంభవించిన శ్రమల ప్రతిఫలం ఈ లోకంలోనే పొందాలన్న ప్రసక్తి వచ్చినా దేవుడు ఎవరినైతే శ్రమలపాలు చేస్తాడో వారి ఆత్మలను తన మృదువైన దీవెనలతో అభిషేకించి తీరతాడు. అవును,వేచియుండగల శక్తిని పొందిన వాళ్ళు క్రైస్తవ జీవితంలో గొప్ప అనుభవజ్ఞులన్న మాట.

Share this post