Skip to Content

Day 295 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

2 August 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు, ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను (నిర్గమ 3:1,2).


ఎప్పటిలాగానే కాయకష్టం చేసుకునే వేళ దర్శనం వచ్చింది. ఇలాటి సమయాల్లోనే దర్శనమివ్వడం దేవునికి ఇష్టం. తన దారినపోతూ ఉన్న మనిషిని దేవుడు ఎన్నుకుంటాడు. అతని ఎదుట దేవుని అగ్ని సాక్షాత్కరిస్తుంది. అనుదిన జీవితపు కష్టాల్లోనే కృపా సామ్రాజ్యం ఎదురవుతుంది.


తండ్రియైన దేవా, మామూలు రోడ్డుమీద నీ సన్నిధికోసం ఎదురుచూసే జ్ఞానాన్ని దయచెయ్యి. ఆశ్చర్యకార్యాల కోసం నేను అడగడం లేదు. దైనందిన విధులు, ఉద్యోగాలలో నాతో సంభాషించు. నేను అలవాటుగా చేసే ప్రయాణాల్లో నాతో కలసి ప్రయాణించు. నా దీన బ్రతుకును నీ సన్నిధిలో మార్పునొందించు.


కొందరు క్రైస్తవులనుకుంటారు తామెప్పుడూ ప్రత్యేకమైన దర్శనాలనూ, అంతులేని ఆనందానుభూతులనూ పొందుతూ ఉండాలేమోనని. ఇది కాదు దేవుని పద్ధతి. ఉన్నత స్థలాల్లో ఆత్మీయానుభవాలు, అగోచరమైన ప్రపంచాలతో అపూర్వమైన సాంగత్యాలు, ఇవీ కాదు దేవుడు చేసిన ప్రమాణాలు. అనుదిన జీవితంలోనే ఆయనతో సహవాసం మనకు ఉంది. అది చాలు.


రూపాంతరాన్ని కేవలం ముగ్గురు శిష్యులు మాత్రమే చూశారు. ఆ ముగ్గురే గెత్సెమనే యాతననూ చూశారు. ఎవరికీ రూపాంతర పర్వతంమీద శాశ్వతంగా ఉండిపోయే అనుమతి లేదు. లోయలోకి దిగివచ్చి చెయ్యవలసిన పనులున్నాయి. యేసు ప్రభువు తన మహిమలో కాదు గాని ఇహలోకపు శ్రమలోనే తన ప్రయోజనాన్ని మనుషులకు కనబరిచాడు, మెస్సియాగా కనిపించాడు.

Share this post