Skip to Content

Day 291 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

2 August 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు... తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు.

(ఆది 15:13,14).


దేవుడు ఇస్తానన్న ఆశీర్వాదాలలో ఆలస్యం, శ్రమలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. అబ్రాహాము జీవితకాలమంతా ఆ ఆశీర్వాదం ఆలస్యం అయింది. దేవుని ప్రమాణం నిరర్థకమేమో అనిపించింది. అబ్రాహాము సంతతి వాళ్ళకు కూడా ఈ ఆలస్యం భరించరానిదైంది. అయితే ఇది కేవలం ఆలస్యం మాత్రమే. వారు చాలా ఆస్తితో బయలుదేరి వచ్చారు, వాగ్దానం నెరవేరింది.


ఈ ఆలస్యాలతో దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. ఆలస్యాలతో పాటు శ్రమలు వస్తాయి. అయితే వీటన్నిటిమధ్య దేవుని వాగ్దానం మాత్రం నిలిచే ఉంది. అది నాతో క్రీస్తు మూలంగా ఆయన చేసిన క్రొత్త నిబంధన. నాకు అవసరమైన ప్రతి చిన్న చిన్న ఆశీర్వాదాలు మాత్రం నాకెప్పుడూ ఉంటాయి. ఆలస్యం, శ్రమ ఆ వాగ్దానంలోని భాగాలే. వాటికోసం ఈ రోజున ఆయన్ను స్తుతిస్తాను. దేవుని గురించి కనిపెడతాను. ధైర్యంతో ఉంటాను. ఆయనే నన్ను బలపరుస్తాడు.


నీ విన్నపం దేవునికి వినబడేలా

విశ్వాసం వీగిపోసాగిందా

కన్నీరు వరదలై పారిందా

దేవుడు ఆలకించలేదనకు

ఎప్పుడో ఎక్కడో నీ ప్రార్థన తప్పక ఫలిస్తుంది.


జవాబు రాలేదా, అది నిరాకరణ అనుకోకు

నీ పని ఇంకా ఎక్కడో అసంపూర్తిగా ఉందేమో

నీ మొదటి ప్రార్థనప్పుడే మొదలైంది దాని నెరవేర్పు

మొదలుబెట్టిన దానిని దేవుడు తుదముట్టిస్తాడు

ధూపం అలాగే వెలగనియ్యి

ఎప్పుడో ఎక్కడో ఆయన మహిమని తప్పక చూస్తావు.


జవాబు రాలేదా, విశ్వాసానికి జవాబు రాకుండా పోదు

దాని పునాది బండమీదనే

వానల్లో వరదల్లో అది కదిలిపోదు

దైవశక్తి తన మొరలు విన్నదని తెలుసు దానికి

ఎప్పుడో ఎక్కడో అది జరిగి తీరుతుంది.

Share this post