- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
వాళ్ళు పగలగొట్టబడడం వల్ల శుద్ధులౌతారు (యోబు 41:25 - స్వేచ్ఛానువాదం).
పగిలిన వస్తువుల్ని, మనుషుల్ని దేవుడు తన సంకల్పసిద్దికి ఎక్కువగా వాడుకుంటూ ఉంటాడు. ఆయన స్వీకరించే బలులు ఏమిటంటే విరిగి నలిగిన హృదయాలే. పేనూయేలు దగ్గర యాకోబు మానవశక్తి అంతా విచ్ఛిన్నమైనందువల్లనే దేవుడు అతణ్ణి ఆత్మ వస్త్రాలతో ఆదరించాడు. హోరేబు దగ్గర మోషే కర్రతో రాయిని బ్రద్దలు చేసినందువల్లనే ఎందరో దాహంగొన్నవాళ్ళ కోసం చల్లని నీళ్ళు వెలువడ్డాయి.
గిద్యోను నాయకత్వంలోని 300 మంది సైనికులు తమ కుండలను పగలగొట్టినప్పుడే (అంటే తమనుతాము బ్రద్దలు కొట్టుకున్నట్టు) లోపల ఉన్న వెలుగు బయటపడి శత్రువుల్ని కంగారు పెట్టింది. పేద విధవరాలు తనకున్న కొద్దిపాటి నూనెను బయటకు పోసినందువల్లనే దేవుడు ఆమె అప్పులన్నీ తీరడానికి ఆమె జీవనోపాధికి చాలినంతగా ఆ నూనేను ఆశీర్వదించాడు.
ఎస్తేరు తన ప్రాణాలకు తెగించి రాజు సముఖానికి వెళ్ళే కట్టడిని అధిగమించి నందువల్లనే కదా తన జనాంగాన్ని మరణం నుండి కాపాడుకోగలిగింది. యేసు అయిదు రొట్టెలను తీసుకొని విరిచినందువల్లనే అది అయిదు వేలమందికి సరిపోయేటంతగా విస్తరించింది. మరియ తన అత్తరు బుడ్డిని పగలగొట్టినందువల్లనే కదా పరిమళం ఆ ఇల్లంతా నిండింది. అలాగే యేసుప్రభువు ముళ్ళతోను, మేకులతోను, బాకుతోను తన శరీరాన్ని పొడవనిచ్చినప్పుడే ఆయనలోని జీవం సముద్రపు పొంగులా బయటకి పారి దప్పిగొన్న పాపుల దాహం తీర్చి బ్రతికించింది.
కుదురుగా ఉన్న ధాన్యపుగింజ పగిలి, చచ్చిపోతేనే దాని గుండెల్లో నుంచి ఒక మొలక పుట్టి వందలకొద్ది గింజల్ని కంటుంది. ఈ విధంగా చరిత్రలో, జీవిత చరిత్రలో, వృక్షశాస్త్రంలో, ఆత్మీయ జీవితంలో పగిలిన వస్తువులు కనిపిస్తున్నాయి.
ఆస్తిపరంగా చితికిపోయినవారు, అహం చచ్చినవాళ్ళు, తమ తమ ఆశలను వదులుకున్నవాళ్ళు, తమ ఆదర్శాలను పోగొట్టుకున్నవాళ్ళు, లోక ప్రతిష్టను లెక్కచెయ్యని వాళ్ళు, ప్రేమల్ని త్యాగం చేసినవాళ్ళు, తరచుగా ఆరోగ్యాన్ని కోల్పోయేవాళ్ళు, సమస్తాన్నీ పోగొట్టుకుని దిక్కుమాలినట్టు అయిపోయేవాళ్ళు... ఇలాటి వారినే పరిశుద్దాత్మ ఎంచుకుని దేవుని మహిమకోసం వాడుకుంటాడు. "కుంటి వాళ్ళు దోపుడు సొమ్ము పంచుకుంటారు" అని యెషయా అంటున్నాడు.
హలం దున్ని పండించిన పంటపొలంలా
దేవా, నా హృదయ క్షేత్రాన్ని సాగుచెయ్యి
వికసించే మొగ్గ పగిలి కుసుమించినట్టుగా
నా జీవితాన్ని బ్రద్దలు చెయ్యి
అత్తరు బుడ్డిని పగులగొట్టి
నా విశ్వాస పరిమళాన్ని
దేవా! విశ్వమంతా వ్యాపింపజెయ్యి.