Skip to Content

Day 287 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

2 August 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

ఇదిగో ప్రభువు దూత అతనిదగ్గర నిలిచెను; అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను.దూత పేతురు ప్రక్కను తట్టి - త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతులనుండి ఊడిపడెను (అపొ.కా. 12:7).


"అయితే మధ్య రాత్రివేళ పౌలును సీలయు దేవుని ప్రార్ధించుచు కీర్తనలు పాడుచు నుండిరి; ఖయిదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నియు తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను" (అపొ.కా. 16: 25, 26).


ఇదే దేవుని పద్దతి. రాత్రి గాఢాంధకారంలో ఆయన అలలమీద నడిచి వస్తాడు. ఉరితీసే సమయం దగ్గర పడుతుంటే దేవదూత పేతురున్న గదికి వచ్చాడు. మొర్దేకై కోసం నిర్మించిన ఉరికంభం సిద్దమైన తరువాత చక్రవర్తికి నిద్రపట్టలేదు. అలా నిద్ర పట్టకపోవడమే యూదులకి మేలుగా పరిణమించింది.


హృదయమా, నీకు విడుదల కావాలంటే నీవు భరించగలిగేటంత బాధను నువ్వు అనుభవించాలి. కానీ చివరకి నీకు విడుదల మాత్రం దొరుకుతుంది. దేవుడు నిన్ను ఎదురుచూసేలా చేస్తాడు. కాని తాను చేసిన నిబందన ఆయన మరచిపోడు. తన అమూల్యమైన మాటను నెరవేర్చుకోవడానికి తిరిగి వస్తాడు.


దేవుడు పనిచేసే విధానంలో ఒక సామాన్యత ఉంది. ఏ సందర్భానికైనా సరిపోయే వివేకం ఉంది. తనపై నమ్మకం ఉంచిన వారిపట్ల ఆయన విశ్వాస్యత అచంచలమైనది. తన సంకల్పాలను నెరవేర్చడంలో ఆయనకొక దీక్ష ఉంది. ఒక తోటి ఖైదీ, తరువాత ఒక కల, ఈ రెంటి సహాయంతో చెరసాలలో ఉన్న యోసేపును ప్రధానమంత్రిని చేశాడు. ఒక్కసారి అంత ఉన్నత పదవి దక్కినందుకు యోసేపు తత్తరపడకుండా అతని చెరసాల అనుభవాలు అండగా నిలిచాయి. దేవుని పద్ధతుల్లో నమ్మకముంచి ఆయన కాలనిర్ణయం ప్రకారం వెళ్ళడం ఎంతో శ్రేయస్కరం.


తనవారిని వెయ్యి రకాలైన బందీఖానాల నుండి విడిపించడానికి దేవుని దగ్గర వెయ్యిరకాలైన తాళపు చెవులు ఉన్నాయి. విశ్వాసం కలిగి ఉందాం. మన పని ఏమిటంటే ఆయన కోసం బాధలు పడడానికైనో సిద్ధం కావడమే. ఆయన చెయ్యవలసిన పనిని ఆయనకు వదిలెయ్యడమే.


కష్టకాలం అద్భుత కార్యాలకు తగిన సమయం. కష్టకాలం అంటే అద్భుత కార్యానికి మొదటి రంగమన్నమాట. ఆ అద్భుతకార్యం అత్యాశ్చర్యకరంగా ఉండాలి అంటే ఆ కష్టకాలం అతి దుర్భరమైనదై ఉండాలన్నమాట.

Share this post