Skip to Content

Day 285 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

2 August 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

అతనిని పట్టుకొని.. చెరసాలలో వేయించెను.. యెహోవా యోసేపునకు తోడైయుండి . . .. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను (ఆదీ39: 20-23).


మనం దేవుణ్ణి సేవించేటప్పుడు ఆయన మనలను చెరసాలకు పంపించి, మనతోబాటు ఆయన కూడా వస్తే ఆ చెరసాల అంత ధన్యకరమైన స్థలం మరొకటి లేదు. యోసేపుకు ఈ విషయం బాగా అర్ధమైనట్టుంది. పరిస్థితులన్నీ తనకు వ్యతిరేకంగా ఉన్నాయని అతడు చిన్నబుచ్చుకోలేదు, నిరుత్సాహపడలేదు. అతడలా ఉన్నట్టయితే చెరసాల అధికారి అతనికి బాధ్యతలు అప్పగించేవాడు కాదు. యోసేపు తన గురించి తాను జాలిపడినట్టు కూడా కనిపించడు.


ఇలాటి నిస్పృహ ఏ మాత్రం చోటుచేసుకున్నా అది మన అంతానికే దారితీస్తుంది. దాన్ని వెంటనే వెళ్ళగొట్టేయ్యాలి. యోసేపు తనకు సంభవించిన దానినంతటినీ దేవుని పట్ల సంతోషకరమైన స్తోత్రగానంగా మార్చివేసుకున్నాడు. అందుకనే చెరసాల అధిపతి యోసేపుకు బాధ్యతలు అప్పగించాడు. "యేసుప్రభువా, చెరసాలలో నేను బందీనైనప్పుడు నాలోని నిరీక్షణ తరిగిపోనియ్యకు. నా సంతోషాన్ని సమృద్ధిగా పొంగిపొరలేలా చెయ్యి. చెరసాలలో నా ద్వారా నీ పనిని అభివృద్ధి చెయ్యి. అక్కడ కూడా నన్ను స్వతంత్రుణ్ణి చెయ్యి."


పంజరంలోని పక్షిని నేను

చెరలోంచి పాటలు పాడతాను

నన్నక్కడ ఉంచిన దేవుని కీర్తిస్తాను

నాకు దిగులే లేదు

నేనక్కడ ఉండాలని దేవుని అభీష్టం


నా పంజరం నన్ను బంధించింది

బయట ప్రపంచంలోకి ఎగిరిపోలేను

నేను బందీనైనా నా ఆత్మ స్వతంత్రమే

చెరసాల గోడలు ఆపలేవు

ఎగిరిపోయే ఆత్మ విహంగాన్ని


చీకటినీ, వేదననూ ప్రేమించడం నేర్చుకున్నాను. ఎందుకంటే అక్కడ దేవుని వదనాన్ని చూడగలుగుతున్నాను.

Share this post