Skip to Content

Day 282 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

మీయందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు (యెషయా 30:18).


ఎక్కువగా వర్షం పడినచోట గడ్డి ఎక్కువ పచ్చగా ఉంటుంది. ఐర్లండు మీద ఎప్పుడూ పడుతూ ఉండే పొగమంచువల్లే ఆ దేశం అంత సస్యశ్యామలంగా ఉంటుందనుకుంటాను. వేదనల పొగమంచులు, బాధల వర్షాలు ఎక్కడన్నా కనిపిస్తే అక్కడ సస్యశ్యామలమైన ఆత్మలు కనిపిస్తాయి. వాటిలో దేవుని ప్రేమ పంటలు సమృద్ధిగా పండుతూ ఉంటాయి. "పిట్టలు కనిపించవే.. ఎక్కడికి వెళ్ళాయి? చనిపోయాయా?" అంటూ దిగులుపడవద్దు. అవి చనిపోలేదు. అవి చాలాదూరం వలసపోయాయి. అయితే అవి త్వరలో తిరిగి వస్తాయి "పూలు వాడిపోయాయి. చలికాలం వాటిని చంపేసింది. అవి ఇక కనిపించవు" అంటూ నిరుత్సాహపడకు. మంచు పడి అవి తాత్కాలికంగా కనిపించడం లేదు. వాటిని మంచు కప్పివేసింది. త్వరలో అవి తలలు పైకెత్తి కుసుమిస్తాయి. మబ్బులు అడ్డువచ్చినప్పుడు సూర్యుడు కనిపించకుండా పోయాడని బాధపడకు. మేఘాల వెనుక సూర్యుడు ఉన్నాడు. తన వెచ్చదనాన్ని తీసుకుని మళ్ళీ వస్తాడు. వానజల్లు పడి పూలు వికసించేదాకా మబ్బులు కనిపిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు తన ముఖాన్ని నీనుండి దాచుకున్నప్పుడు ఆయన నిన్ను మరచిపోయాడనుకోవద్దు. నువ్వు ఆయన్ను ప్రేమించేలా చెయ్యాలని కాస్తంత ఆలస్యం చేస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనలో నువ్వు సంతోషిస్తావు. చెప్పలేని ఆనందంతో ఉల్లసిస్తావు. వేచియుండడం మన వ్యక్తిత్వానికి మెరుగుపడుతుంది. మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. కాబట్టి ఆశతో కనిపెట్టండి. వాగ్దానం నెరవేరడం ఆలస్యమైనా తగిన సమయానికే అది నిజమౌతుంది.


శీతాకాలం ఏటేటా వస్తుంది

ప్రతియేట వర్షం కురుస్తుంది

ఒకరోజు తప్పకుండ వస్తుంది

పక్షులన్నీ కూడి కోలాహలం చేస్తాయి


తరులు చిగురిస్తాయి

మైదానాల్లో హరిత శాద్వలాలు పుట్టుకొస్తాయి

విరులు వింత గంగుల్లో వెలుగులీనుతాయి

పక్షులన్నీ కూడి కోలాహలం చేస్తాయి


ప్రతి హృదయంలో ఏదో భారముంది

ప్రతి మనిషిలో ఏదో దిగులుంది

ఒకరోజు తప్పకుండా వస్తుంది

పక్షులన్నీ కూడి కోలాహలం చేస్తాయి


ధైర్యం దిగజారిపోతున్నప్పుడు

ఒక మధురాశ మనలో మొగ్గతొడగాలి

ఈ నిరాశ నిస్పృహల శీతల రాత్రులు గడిచిపోతాయి

పక్షులన్నీ కూడి కోలాహలం చేస్తాయి.

Share this post