Skip to Content

Day 280 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

2 August 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకునిమాట వినువాడెవడు? వెలుగులేకయే చీకటిలో నడచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను (యెషయా 50:10).


అభ్యంతరాల అంధకారం, కంగారు, చీకటి మనసులో కమ్మినప్పుడు విశ్వాసి ఏమి చెయ్యాలి? దేవుని చిత్తప్రకారం నడిచే విశ్వాసికే అంధకారపు ఘడియలు వస్తుంటాయి. ఏమి చెయ్యాలో, ఎటువైపుకు తిరగాలో తెలియని క్షణాలు వస్తూ ఉంటాయి. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటాయి. అతని మార్గంపై పరలోకపు కాంతి ప్రసరించదు. అతనికి చీకటిలో తడుములాడుతున్న భావన కలుగుతుంది.


నీ అనుభవం ఇలా ఉన్నదా? ఇలాటి చీకటి వేళల్లో విశ్వాసి ఏమి చెయ్యాలి? వినండి, "యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను" మొట్టమొదటిగా ఏమీ చెయ్యకుండా కూర్చోవాలి. మన మానవ స్వభావానికి ఇది చాలా కష్టం. ఒక సామెత ఉంది "కంగారు పడినప్పుడు పరుగులెత్తకూడదు" వేరే విధంగా చెప్పాలంటే "ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఏమీ చెయ్యకూడదు."


ఆత్మీయమైన మసకచీకటి కమ్మితే తెగించి ముందుకు దూకకూడదు. నీ జీవిత గమనాన్ని తగ్గించు. అవసరమైతే నీ నావకు లంగరు వేసెయ్యి. కేవలం దేవుని మీద నమ్మకం పెట్టుకో. మనం నమ్మకముంచితే ఆయన పనిచేస్తాడు. మన ఆందోళన ఆయన చేతుల్ని కట్టేస్తుంది. మన మనస్సులు అన్యాక్రాంతమై ఉన్నప్పుడు మన హృదయాలు కలవరపడతాయి. మనలను కమ్ముకున్న చీకటి మనలను భయపెడితే, తప్పించుకునే మార్గం కోసం అటూ ఇటూ వ్యర్థంగా పరుగులు పెడుతూ ఉంటే దేవుడు మనకేమీ సహాయం చెయ్యలేడు.


దేవుని శాంతి మన మనస్సును చక్కబెట్టి మన హృదయానికి సేదదీరుస్తుంది. పసి పిల్లవాడిలాగా మన చేతిని ఆయన చేతిలో వెయ్యాలి. ఆయన మనలను తన ప్రేమ ప్రకాశంలోకి నడిపిస్తాడు. అడవుల్లోనుంచి బయటపడే మార్గం ఆయనకు తెలుసు. మనం ఆయన చేతుల్లోకి వెళ్దాం రండి. దగ్గర దారిగుండా ఆయన మనలను బయటకు తీసుకువెళ్తాడు .


నడవడం మనకు చేతగానప్పుడే దేవుడు పైలెట్ గా మన చెంత ఉన్నాడు.


నమ్మికలో నిలకడగా ఉండు

సహనపరుడే జయిస్తాడు

గాలిపాటుకు కదిలి కొట్టుకుపోయేవాడు

నశించిపోతాడు దిక్కు లేకుండా

క్రీస్తును ధరించినవాడు

నింగీ నేలా పడిపోయినా నిలిచే ఉంటాడు.


ఆవేదన ఎంతో కాలం ఉండదు

మట్టి కలసిన ఆశ మళ్ళీ పల్లవిస్తుంది

తుపాను నిమ్మళించాకే అరుణోదయం

సిలువ పథము పరలోకానికి బాట

రాజ్యం తండ్రిదే నమ్మండి

హృదయమా, స్థిరంగా ఉండు.

Share this post