- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను.. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడెను (1 రాజులు 19:12).
ఒకామె ప్రభువును గురించిన అనుభవంలో, అవగాహనలో చాలా త్వరితగతిన ముందడుగు వేసింది. దీన్లోని రహస్యమేమిటి అని అడిగితే "ఆయన స్వరాన్ని జాగ్రత్తగా కనిపెట్టి వినాలి" అని చెప్పింది. మనలో చాలామందికి ఆయన గురించి ఇంకా సరిగ్గా తెలియకపోవడానికి కారణం ఏమిటంటే ఆయన మృదువుగా అంటున్న మాటలను మనం వినిపించుకోవడం లేదు. ఆయన మెల్లగా మనలను ఆపడానికి ప్రయత్నిస్తుంటే మనం లొంగడం లేదు. "నిమ్మళంగా మాట్లాడే" స్వరం చెవులకు వినిపించదు. దానిని మనసులో గ్రహించాల్సిందే. నీ ముఖంమీద కోమలమైన ఈకతో రాసినట్టు నీ మనస్సు మీద తెలిసీ తెలియని ఒత్తిడి ఆయన కలుగజేస్తూ ఉంటాడు. నీ హృదయంలో చిన్ని స్వరం పలకడానికే సందేహిస్తున్నట్టు వినిపిస్తూ ఉంటుంది. దానికి నువ్వు చెవియొగ్గి ఆలకిస్తే అది మెల్లిమెల్లిగా స్పష్టమౌతుంది. ప్రేమగల చెవులకే ఆయన స్వరం వినిపిస్తుంది. ఆ గుసగుసలను వినాలని తాపత్రయపడే మనసుకే అవి వినిపిస్తాయి. ఆ ప్రేమను నిర్లక్ష్యం చేసి చాలకాలం దానికి స్పందించకుండా నమ్మకముంచకుండా ఉంటే అది మాట్లాడడం విరమించుకుంటుంది. ఆయన్ను, ఆయన స్వరాన్నీ నువ్వు ఎరిగి ఉంటే ఆ మెల్లని స్వరం కోసం జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి. సంభాషణలో ఏదైనా ప్రశ్నకి జవాబియ్యబోయే ముందు ఆ మెల్లనీ స్వరం ఏదన్నా చెబుతుందేమో ఎదురు చూడాలి.
ఒక మార్గం ఉత్తమమైనదిగా నీ ఎదుట కనబడినప్పుడు, నీ ఆత్మలోకి ఒక స్పష్టమైన నమ్మకం ప్రవేశించినప్పుడు దాన్ని గురించి వివేచించు. ఆ దారిని వెళ్ళకపోవడం మానవ జ్ఞానానుసారం బుద్దిహీనతలాగా అనిపించినప్పటికి దేవుడు నీ మనస్సులో నచ్చచెప్పిన దానినిబట్టి నీ పాదాన్ని వెనక్కి తీసుకో. ఆయన చిత్తం అర్థమయ్యేదాకా దేవుని ఎదుట కనిపెట్టు. నీ మనస్సులోను, హృదయంలోను ప్రతి పథకాన్నీ దేవున్నే సిద్దం చెయ్య నివ్వు. ఆయన్నే వాటిని అమలు పరచనివ్వు. నీ స్వంత తెలివితేటలను అనుసరించకు. చాలాసార్లు ఆయన ఇచ్చిన ఆలోచనకీ, ఆయన కల్పిస్తున్న పరిస్థితులకీ ఎక్కడా పొంతన ఉండదు. ఒక్కొక్కసారి దేవుడు తనకు వ్యతిరేకంగా తానే పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. కేవలం విని ఆయనకు లోబడు. అలా చెయ్యడం నష్టకారణమని తెలిసినా సరే. దేవుడే చివరికి అన్నీ సమకూడి జరిగేలా చేస్తాడు.
ఆయన స్వరాన్ని నువ్వు గుర్తు పట్టగలిగితే దాన్ని అనుసరించడం ద్వారా కలిగే ఫలితాలను లెక్కచెయ్యకు. చీకటిలోకి ఆయన వెళ్ళమన్నప్పటికీ సందేహించక బయలుదేరి వెళ్ళు. ఆయనే నీకు వెలుగౌతాడు. నీ హృదయంలో ఆయనతో స్నేహం, సహవాసం మొలకెత్తుతాయి. అవే ఆయననూ, నిన్నూ కలిపి బంధిస్తాయి. శ్రమలు ఎంత తీవ్రమైనా, పరీక్ష ఎంత భారమైనా ఆ బంధాలు తెగవు.