Skip to Content

Day 268 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

2 August 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చెనేమి? (కీర్తనలు 42:9).


విశ్వాసీ, ఈ ప్రశ్నకు జవాబు నీ దగ్గర లేదా? ఎక్కువ సమయం నువ్వు చింతాక్రాంతుడవై తిరుగుతూ ఉంటావేమిటి? దుఃఖకరమైన ఎదురుతెన్నులతో నిండి ఉంటావేమిటి? రాత్రి గడిచి ఉదయకాంతి వ్యాపిస్తుందని నీకెవరూ చెప్పలేదా? నీ అసంతృప్తి పొగమంచులా పట్టి ఉండగా అది వీడిపోతుందని నీకెవరూ చెప్పలేదా? ఆ మంచు వర్షమై, వర్షం వడగండ్లు, వడగండ్లు తీవ్రమైన తుపానుగా మారుతుందని ఎప్పుడూ భయం పెట్టుకుంటున్నావెందుకు? రాత్రిని ఆనుకునే పగలు, కష్టాన్ని ఆనుకునే సుఖమూ ఉన్నాయని తెలియదా? చలికాలం వెళ్ళిన వెంటనే వసంత కాలం రాదా? నిరీక్షణ కలిగి ఉండు. దేవుడు నిన్ను నిరాశపరచడు.


నా ఆశలన్నింటికంటే మించిన ఫలితాన్ని ప్రభువు ఇస్తాడు. నా భయాలన్నింటినీ పోగొడతాడు. విరిగిపోయిన నా ఆలోచనలతో వంతెన కడతాడు. నా కన్నీళ్ళలో ఇంద్రధనుస్సు మెరిసేలా చేస్తాడు. నా దారికి అడ్డువచ్చిన భీకరమైన అలలు దేవుణ్ణి మోసుకువచ్చే వాహనాలే. అరణ్యమార్గాల్లో తిరుగులాడే వేళ ఆయన ప్రేమలో నేను విశ్రాంతి పొందుతాను. నా హృదయానికి తన ప్రేమ ఔషధాన్ని పూసి గాయాలనన్నిటినీ బాగుచేశాడు. ఆయన నేర్పిన పాఠం కఠినమైనదైనా అది నాకు జ్ఞానాన్ని నేర్పింది. ఆయనలో తప్ప భూమిపై దేనిలోనూ నమ్మకముంచకూడదని బోధించింది.


నాకు అగోచరమైన దారులగుండా నన్ను నడిపించాడు. ఆయన్ను అనుసరిస్తుంటే వంకరదారులు తిన్ననివైనాయి. మెట్టపల్లాలు చదునైనాయి. దారిప్రక్కన నాకు ఖర్జూరపు చెట్లు, చల్లని నీటి ఊటలు సేదదీర్చాయి. రాత్రివేళ మండే అగ్నిమేఘం నాకు దారి చూపింది. పగటివేళ మేఘస్థంభం నీడనిచ్చింది. గడిచిన కాలంలో నా జీవితాన్ని నెమరు వేసుకుంటే రాబోయే కాలంలో నా జీవితమంతా నా భయాలకు అతీతంగా ఉంటుందని అర్థం అయింది. దేవుని మందసంలో ఉన్న మన్నా పాత్రలాగా యాజకుడి చేతికర్రలాగా నా జీవితం దేవుని నిబంధన దయలో పదిలంగా ఉంటుంది.

Share this post