- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
నన్ను వెంబడింపగోరువాడు తన్నుతాను ఉపేక్షించుకొని తన సిలువయెత్తికొని నన్ను వెంబడింపవలెను (మార్కు 8:34).
దేవుడు నన్ను భుజాన వేసుకోమన్న సిలువ అనేక రకాలైన ఆకారాలలో ఉండవచ్చు. ఇంకా ఘనమైన సేవ చెయ్యడానికి నాకు సామర్థ్యం ఉన్నప్పటికీ తక్కువ పరిధిలో ఏదో అల్పమైన సేవ చేయ్యడానికి మాత్రమే నాకు అవకాశం దొరకవచ్చు. ఫలితం ఇవ్వని పొలాన్నే సంవత్సరం తరువాత సంవత్సరం పండిస్తూ ఉండవలసి రావచ్చు. నాకు కీడును చేసిన వాళ్ళ గురించి ప్రేమ, దయగల ఆలోచనలే తప్ప వేరేవిధంగా ఆలోచించకూడదని ఆజ్ఞ రావచ్చు. అలాటి వాళ్ళతో మృదువుగా మాట్లాడి వాళ్ళకు సహాయం చేయవలసి రావచ్చు. దేవుని గురించి వినడం అసహ్యమైన వాళ్ళదగ్గరే ఆయన మాటలు పదేపదే చెప్పవలసి రావచ్చు.
సిలువలు చాలా రకాలు. అన్నీ అతి భారమైనవి. నా ఇష్టప్రకారమైతే వాటిల్లో దేన్నీ ఎంచుకోను. కాని నేను సిలువను ఎత్తుకొని సహనంతో సణుగుడు లేకుండా నా భుజంమీద దాన్ని మోసినప్పుడే యేసు నాకు సమీపంగా ఉంటాడు.
ఆయన నన్ను సమీపించి నా జ్ఞానాన్ని పరిపక్వం చేసి, నాలో శాంతిని నింపి, నా ధైర్యాన్ని పెంచి, కష్టమైనా, నిష్టూరమైనా నాలోని శక్తి ఇతరులకు ఉపయోగపడేలా చేస్తాడు.
నీ సిలువ నీ చేతికర్రగా ఉపయోగపడేలా చేసుకో. నిన్ను భారంతో నేలకు అణగదొక్కే బరువుగా కాదు.
సంతోషంగా నీ సిలువను మోసావంటే నిరాశ, నిస్పృహలనుండి నీ తోటివారిని విడిపించగలవు.