Skip to Content

Day 254 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానఫలము పొందెను (హెబ్రీ 6:15).


అబ్రాహాముకి దీర్ఘకాల విషమ పరీక్షలు వచ్చాయి. కాని అతనికి దక్కిన ప్రతిఫలం అతి శ్రేష్టమైనది. తన వాగ్దాన నెరవేర్పును ఆలస్యం చెయ్యడం ద్వారా దేవుడు అతణ్ణి శోధించాడు. సైతాను అతణ్ణి శోధించాడు. మనుషులు అసూయ, అపనమ్మకం, ప్రతిఘటనల ద్వారా అతణ్ణి శోధించారు. శారా తన ముభావంతో శోధించింది. అన్నిటినీ ఓపికతో అతడు సహించాడు. దేవుని శక్తిని, విశ్వాస్యతను, జ్ఞానాన్ని అతడు తప్పు పట్టలేదు. ఆయన ప్రేమను శంకించలేదు. ఆయన ఊహాతీతమైన జ్ఞానానికి అబ్రాహాము తలవంచాడు. ఆలస్యమౌతున్నప్పటికీ మౌనంగా ఉన్నాడు. దేవుని సమయం వచ్చేదాకా కనిపెట్టాడు. అతడు అలా సహనంతో ఉన్నందువల్లనే వాగ్దానఫలం పొందాడు.


దేవుని వాగ్దానాలు నెరవేరకుండా ఉండవు. ఓపికతో కనిపెట్టిన వాళ్ళు ఎన్నటికీ నిరాశ చెందరు. నమ్మకంతో ఎదురు చూసినవాళ్ళు ఫలితం పొందుతారు.


అబ్రాహాము ప్రవర్తన మనలోని తొందరపాటును, సణగుకునే గుణాన్ని గద్దిస్తూ ఉంది. ఓపికనూ, దేవుని చిత్తానికీ, ఆయన మార్గాలకూ లోబడే మనస్సునూ ప్రోత్సహిస్తూ ఉంది. గుర్తుంచుకోండి. అబ్రాహాము శోధించబడ్డాడు. అతడు ఓపికతో సహించాడు, వాగ్దాన ఫలాన్ని పొందాడు, తృప్తి చెందాడు. అతని ఉదాహరణను అనుసరించండి. అదే ఆశీర్వాదాలను మీరు పొందుతారు.

Share this post