Skip to Content

Day 244 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

2 August 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును (యెషయా 54:11).


గోడలో ఉన్న రాళ్ళు అంటున్నాయి "మేము ఎక్కడో పర్వతాల్లో ఉండేవాళ్ళం. కఠినంగా, కర్కశంగా ఉండే కొండ చరియల్లో ఉండేవాళ్ళం. వేడిమి, వర్షం కొన్ని వేల సంవత్సరాలుగా మమ్మల్ని ఆకారాల్లేని బండరాళ్ళుగా మలిచాయి. అయితే మానవ హస్తాలు మమ్మల్ని నివాసాలుగా కట్టాయి. మాతో నిర్మితమైన నివాసాల్లో మానవులు పుడుతున్నారు, బాధలు పడుతున్నారు, పండుగలు చేసుకుంటున్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారు. వాళ్ళనూ, మమ్మల్ని చేసిన సృష్టికర్త నియమించిన పాఠాలను నేర్చుకుంటున్నారు. మేము ఇలా ఆశ్రయమిచ్చే రాళ్ళుగా రూపు దిద్దుకోవడానికి ముందు మేము చాలా శ్రమలను అనుభవించాం. తుపాకి మందు మా గుండెల్ని చీల్చింది. పెద్ద పెద్ద సుత్తులు మమ్మల్ని పగలగొట్టాయి. ఆ దెబ్బలకు అర్థం లేనట్టు అనిపించింది. ఎందుకు కొడుతున్నారో మాకు తెలిసేది కాదు. చాలాకాలం వికృతమైన రూపాలతో చెల్లాచెదురుగా పడి ఉన్నాం. కొంతకాలానికి మమ్మల్ని ఈ ఆకారంలోనికి తెచ్చారు. సున్నితమైన పరికరాలతో మమ్మల్ని నునుపు చేశారు. ఇప్పుడు మాకు ఆకారం ఉంది, మా ఉపయోగం తెలిసింది. ఇప్పుడు మనుషులకు మేము ఉపయోగపడుతున్నాం.


"ఇప్పుడు నువ్వు ఆకారం లేకుండా క్వారీలో పడి ఉన్నావు. మాకు ఒకప్పుడు అనిపించినట్టే ఇప్పుడు నీకు ఇదంతా ఎందుకో అర్థం కాదు. కాని ఉన్నత సౌధాన్ని కట్టేందుకు నువ్వు ఉపయోగపడనున్నావు. కొంతకాలానికి దైవహస్తాలు నిన్ను నీ స్థానంలో ఉంచుతాయి. పరలోకపు దేవాలయంలో సజీవమైన రాయిగా నువ్వు కలకాలం ఉంటావు."


నిశ్చల నిశీధిలో నిశ్శబ్ద సంగీతం

చెక్కని పాలరాతిలో దాక్కున్న సౌందర్యం

సంగీతం వినబడాలన్నా సౌందర్యం కనబడాలన్నా

కళాకారుడు కావాలి శిల్పి రావాలి


దివ్య సంగీత విద్వాంసుడా, నాలోని సంగీతం

మూగవోకుండా నీ చేతులతో జీవం పొయ్యి

ఓ పరమ శిల్పీ, నీ సుత్తితో, ఉలితో చెక్కి

నాలోని సౌందర్యాన్ని వెలికి తియ్యి

Share this post