- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
ఆయన తన సిలువ మోసికొని కపాలస్థలమను చోటికి వెళ్ళేను (యోహాను 19:17).
"మారిన సిలువ" అనే ఒక పద్యం ఉంది. ఒక స్త్రీ తన సిలువను మొయ్యలేక అలసి సొలసీ తన చుట్టూ ఉన్నవాళ్ళు మోస్తున్న సిలువలను చూసి "నా సిలువ వాళ్ళందరి సిలువల కంటే బరువైనది" అనుకుంది. తన సిలువకు బదులుగా వేరొకరి సిలువ తనకు పస్తే బావుండుననుకుంటూ నిద్రపోయింది. ఆ నిద్రలో ఒక కలొచ్చింది. చాలా రకాలైన సిలువలు ఒక చోట పడి ఉన్నాయి. ఆమె అక్కడికి చేరుకుంది. ఒక చిన్న బంగారు సిలువ వజ్రాలతో పొదికి చూడముచ్చటగా కనిపించింది. "దాన్నయితే ఇష్టంగా ధరించుకుని తిరగగలను" అనుకుందామె. దాన్ని తీసుకోవడానికి వంగింది. ఆ బంగారం, వజ్రాలు అందంగానే ఉన్నాయి గాని ఆ సిలువ ఆమె కదిలించలేనంత బరువుగా ఉంది.
ఆ ప్రక్కనే అందంగా చెక్కిన ఒక సిలువ కనిపించింది. దాని చుట్టూ పూల తీగెలు అల్లుకుని ఉన్నాయి. ఆమె అది బాగుందనుకుంది. అయితే ఆ పుష్పాల క్రింద ముళ్ళున్నాయి. అవి ఆమె చేతికి గుచ్చుకుంటున్నాయి.
ఇంకా ముందుకి వెళ్ళేసరికి వజ్రాలూ, పువ్వులూ ఏమీ లేకుండా సాదాగా ఉన్న సిలువ ఒకటి కనిపించింది. దానిమీద కొన్ని ప్రేమ వాక్యాలు వ్రాసి ఉన్నాయి. ఆమె దాని ఎత్తుకుంది. అది మిగతా వాటన్నిటికంటే తేలికగా, మొయ్యడానికి సౌకర్యంగా ఉంది. పరలోకపు కాంతిలో దాన్ని పరిశీలించి చూస్తే అదీ తన పాత సిలువేనని ఆమెకు అర్థమైంది. తిరిగి ఆ సిలువ ఆమెకు దొరికింది. ఆమెకు అదే అన్నిటికంటే తేలికైన, సరియైన సిలువ.
మనం ఏ సిలువను మోయగలమో దేవునికి తెలుసు, ఇతరులు మోసే సిలువలు ఎంత బరువైనవో మనకు తెలియదు. ధనవంతులైన వాళ్ళను చూసి మనం అసూయపడతాం. వాళ్ళు మోసేది వజ్రాలు పొదిగిన బంగారు సిలువ. అది ఎంత బరువు ఉంటుందో మనకు తెలియదు. కొందరి జీవితాలు ఎంతో అందంగా ఉన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు పూలతో ఆలంకృతమైన ఆ సిలువను మోస్తున్నారు. మన సిలువకంటే తేలిక అనుకున్న సిలువలన్నింటినీ మనం ఒకసారి మోసి చూస్తే మనకు అర్ధమౌతుంది. మనకు సరిగ్గా సరిపోయేది మన సిలువేనని.
నీ సిలువను చిరాకుతో పారేసుకుంటే
దొరకదది మళ్ళీ ఈ లోకంలో
దేవునికోసం ఇక్కడే మోయాలి దాన్నని
నియమించాడాయన
మరో లోకంలో ఆయనతో ఉంటాము
ఆయన్ను ప్రేమిస్తూ ఉంటాము కాని
ఇక్కడ తప్ప మరెక్కడా దక్కదు
ఆయన కోసం శ్రమించే ధన్యత
గంట, రెండు గంటలు శ్రమపడలేవా
సమాప్తమైనదంటూ ఆయన పిలిస్తే
నీలో రగులుకునేది నిరుత్సాహమే
విడుదల వచ్చినప్పుడు అంటావు గదా
"నన్ను మరి కాసేపు మోయనివ్వండి
నా దేవుని మహిమార్థం బాధలుపడనివ్వండి"
ఇంత త్వరగా అయిపోయిందని దిగులు
దేవుడు నీలోంచి మహిమ పొందాలి
ఇంకా కొంతకాలం, ఇంకా కొంతకాలం.