Skip to Content

Day 239 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

2 August 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

సమూహములోనుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొనిపోయి ... (మార్కు 7:33).


పౌలు క్రైస్తవ నిర్వాహకత్వంలో హుషారుగా పాలుపంచుకోవడమే కాదు, చెరసాల ఒంటరితనాలు కూడా చవి చూశాడు. తీవ్రమైన బాధలతో కూడిన కాయకష్టాన్ని మీరు తట్టుకుని నిలబడగలరేమో గాని, క్రైస్తవ కార్యకలాపాలన్నిటి నుండి దూరమైపోతే మాత్రం నిలదొక్కుకోలేరు. ఏదో ఒక చెరసాల గదికి పగలూ, రాత్రీ అంకితమైపోయి ఉండలేరు.


ఆకాశపక్షి ఆఘమేఘాల్లో ఎగురుతూ గంటల తరబడి రెక్కలాడించడంలో ఏమీ శ్రమపడదు గాని, పంజరంలో రెక్కలు విదుల్చుకోవడానికైనా చోటు లేని బందిఖానాలో ఉంచితే అది కృశించిపోతుంది. పక్షిరాజు అయినా సరే చిన్న పంజరంలో ఉంటే తల వ్రేలాడేసి, రెక్కలు నిస్త్రాణంగా వాల్చి, దిగులుపడుతూ ఉంటుంది. పనిచెయ్యకుండా అవరోధాలు వస్తే మనకు ఎంత నిస్సహాయత!


చెరసాలలో పౌలు జీవితమనే నాణానికి ఇది రెండో వైపు. పౌలు ఈ అనుభవాన్ని ఎలా చూపిస్తున్నాడో తెలుసా? తన చెరసాల గోడల పైగా, తన శత్రువుల తలలపైగా తన దృష్టిని సారిస్తున్నాడు. ఒక పత్రాన్ని రాసి క్రింద హుందాగా తన సంతకం చేస్తున్నాడు. "నేను ఖైదీని కాను, సీజరు నన్ను బంధించలేదు, సన్ హెడ్రిన్ వారి ఎదుట నేను దోషినీ కాను - ప్రభువునందు బందీని" ఈ బంధకాల్లో దేవుని హస్తాన్నే అతడు చూశాడు. అతనికి చెరసాల ఒక రాజభవనం అయింది. దాని వరండాలు జయోత్సాహంతో, కేరింతాలతో నిండాయి.


అతనికి తన ప్రియమైన మిషనరీ పని చెయ్యకుండా అవరోధం కలిగింది. అయితే ఇప్పుడు ఒక క్రొత్త వేదికను అతడు సిద్ధంచేసుకున్నాడు. ఒక క్రొత్త సాక్ష్యం. ఆ నాలుగు గోడల మధ్యనుండి అత్యంత మధురమైన క్రైస్తవ స్వాతంత్ర్యపు నివేదికలు బయటకు వచ్చాయి. ఆ బంధిఖానా చీకటిలోనుండి వెలుగు సందేశాలెన్నో వెలువడినాయి.


పౌలు అడుగుజాడల్లో చెరసాలల్లో మగ్గిపోయిన అసంఖ్యాకమైన పరిశుద్దులు సంఘచరిత్రలో ఎందరెందరో! జాన్ బన్యన్ బెడ్ ఫోర్డు జైలులో ఇరవై సుదీర్ఘమైన సంవత్సరాలు ఉండిపోయాడు. అయితే అతడు తన జీవితంలో అతి విలువైన, ప్రశస్థమైన పనిని చేపట్టి పూర్తి చేశాడు. బైబిలు తరువాత ఎక్కువగా అందరూ చదివే పుస్తకాన్ని అతడు వ్రాశాడు. అతడిలా అన్నాడు "జైల్లో నాకేమీ ఇబ్బంది లేదు. కూర్చొని అదేపనిగా రాసుకుంటూ పోయాను. నన్ను ఆవహించిన ఆనందోత్సాహాలు నన్ను రాయడానికి ప్రోత్సహించాయి."


ఆ సుదీర్ఘమైన చెరసాల జీవితం అనే రాత్రి ఎంతోమంది వేసారిన యాత్రికుల మర్గాలను కాంతిమయం చేసింది. చల్లని మనస్తత్వంగల ఫ్రెంచి మహిళ మేడమ్ గయాన్ చాలాకాలం చెరసాల గోడల మధ్య ఉంది. కొన్ని పక్షులు పంజరంలో ఉన్నప్పుడే తియ్యగా పాడినట్టు ఆమె హృదయంలో పుట్టిన గీతమాల ఆ గోడల్ని దాటి ఎన్నెన్నో నలిగిన హృదయాలకు సేదదీర్చింది.


ఏకాంత ప్రదేశాల్లో నుండి వస్తున్న ఆదరణ ఎంత అద్భుతమైనది!


యేసుతో ఏకాంతంలోకి

ఆయన చేతిలో చేతితో

ఆయన నీడలో కొంత సేపు

విశ్రమిస్తూ ఎడారిలో సాగిపోతూ


యేసుతో ఏకాంతంలోకి

చీకటి నిండిన ఒంటరితనంలో

మరే ఆదరణా లేనిచోటికి

మనోరంజకమైన ఆయన స్వరంతో


యేసుతో ఏకాంతంలోకి

ఆయనతో ఒంటరిగా

ఆయన ప్రేమ వాక్కులు ఆలకిస్తూ

నీడల్లో నిశ్శబ్దాల్లో


యేసుతో ఏకాంతంలోకి

ఎడారిలోకి అయినా సరే

ఆయన స్వరం వినడానికి

ముఖాముఖిగా ఆయన్ను చూడడానికి

Share this post