Skip to Content

Day 238 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

2 August 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

అది నాలో లేదు (అనును) (యోబు 28:14).


ఎండాకాలపు రోజుల్లో నేననుకున్నాను, నాకిప్పుడు సముద్ర వాతావరణం, సముద్రపు గాలి అవసరమని. అయితే సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు "అది నాలో లేదు" అని సముద్రం అంటున్నట్టు అనిపించింది. దానివల్ల నేను పొందగలననుకున్న మేలును పొందలేకపోయాను. కొండ ప్రాంతాలకు వెళ్లే నాకు ఆరోగ్యం చేకూరుతుంది అనుకున్నాను. అక్కడికి వెళ్ళాను, తెల్లవారుజామునే లేచి ఎత్తయిన కొండకు ఎదురుగా సౌందర్యాన్ని పరిశీలిస్తూ ఉండగా అది నాతో చెప్పింది "అది నాలో లేదు" నాకు తృప్తినిచ్చే గుణం దానికీ లేదు. అవును, నాకు కావలసింది దేవుని ప్రేమ సముద్రాలు. నాలో ఆయన సత్యం యొక్క ఔన్నత్యాలు. అగాధం "మాలో లేదు" అని చెప్పింది. అది చెప్పింది ఆభరణాలతోను, బంగారంతోను, విలువగల రాళ్ళతోను పోలికలేని జ్ఞానం గురించే. మనలోని అశాంతి ఆయన మన నిత్యస్నేహం, ప్రేమ మన పట్ల వెల్లడి చేసినప్పుడే మనలోని అశాంతి తొలగిపోతుంది.


నా ప్రియుడు నిలిచిన అత్యున్నత శిఖర సీమలపై

గుత్తులు గుత్తులుగా పూసిన గరికపూల మైదానాల్లో

శ్వేత సింహాసనంపై కాంతిపుంజమై

మహిమ మస్తక విలసన్నవ తేజుడై ఆశీనుడై

విరాజిల్లే నిత్య పరలోకం

అక్కడే నా వైభవం అక్కడే నా జీవం

లౌకిక జీవనాన్ని మధురం చేస్తూ

జీవిస్తే మేలు మరణిస్తే లాభమనిపిస్తూ

క్షమా రక్షణలకు ఆయత్తమవుతూ

తన రాచఠీవితో స్వర్గాన్ని సౌందర్యపర్చి

శక్తి శౌర్యాల వాత్సల్య మూర్తియైన

దేవునికే చేరాలి నా వింత వింత విన్నపాలు

అక్కడే నా మనసు అక్కడే నా సిరిసంపదలు

(ఇది కీ.శే. చార్లెస్ కౌమన్ గారికి అత్యంత ప్రియమైన పద్యం).


పక్షిరాజును అడవిలో ఉంచడం కష్టం. సొగసులు, సోగాలు కురిపించే పక్షులెన్నిటినో దాని చుట్టూ చేర్చినా,అందమైన చెట్టుకొమ్మను దానికి నివాసంగా ఏర్పరచినా, దానికి ఇష్టమైన పంచభక్ష్య పరమాన్నాలను దాని ముందుంచినా వీటన్నింటి వంకా అది కన్నెత్తి అయినా చూడదు. తన విశాలమైన రెక్కలు చాపి హిమాలయ శిఖరాలపై తదేకమైన దృష్టి నిలిపి అంతరిక్షంలోకి, ఎత్తయిన గండ శిలల గూడుల్లోకి, నగ్న ప్రకృతిలోకి, బ్రహ్మాండమైన జలపాతాల హోరులో గాలి పాటలు పాడే తావుల్లోకి ఎగిరిపోతుంది.


మానవ హృదయం తన రెక్కలు విప్పుకుని క్రీస్తు అనే బండమీద వాలే దాకా ఎగిరిపోతుంది. దాని నివాసం పరలోక ప్రాకారాలే. దాని ప్రయాణం నిత్యత్వంలోకే. దాని ప్రయాణం నిత్య్యత్వంలోకే. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసము నీవే.


దేవుడు నా యిల్లు, ఇంటికి తీసుకెళ్ళింది క్రీస్తే

చేదోడై నను తన చెంతకి పిలిచాడు

చింతలు బాపి నన్ను చేరదీసాడు

తన అడుగుజాడల్లో నడిపించి తన్మయుణ్ణి చేసాడు

దేవుని ఇంటిలో పవిత్రతతో

ఆనందంలో స్తోత్రార్పణలో ఉంచాడు

పరిశుద్ద పురమా, పిల్లవాడినైన నేను

పరలోకవాసినై నీలో పవళిస్తాను


దేవుడే నా యిల్లు, గడిచిన కాలమంతా

అంతంలేని దారుల్లో అంధుడిలా నడిచాను

నాలో నేనేదో దేవులాడుకున్నాను

దరి చేర్చే దారి దొరక్క దుఃఖపడ్డాను

ఆశలు సమసి భయాలు ఆవరించి

ఏకైక మార్గం క్రీస్తులో దర్శించాను

యన్ను చేరి అక్కడే నివసించాలి

దేవుడే దయతో దీన్ని అనుగ్రహించాడు


దేవుడే నా యిల్లు, ఇప్పుడు నాకు ఆశ్రయం

నా శోధనలను ఎదిరించేది నేను కాదు దేవుడే

బాధలలో ఆదుకుని ఆదరించేదాయనే

దైనందిన అవసరాలకు దిక్కు ఆయనే

దేవుని బిడ్డను నేను ఆయనే నా యిల్లు

దేవా, నాలో నీవు నీలో నేనే

నీలో తప్ప అన్నిట్లోనూ మృతుడినే

సుందర సదనంలో శయనించినప్పుడు

ఇందులో అందులో ఎందులో చూసినా

అందాలు నీవే నా నందనం నీవే

Share this post