- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
అంజూరపుచెట్లు పూయకుండినను ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను ఒలీవచెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొట్టెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవాయందు ఆనందించెదను (హబక్కూకు 3:17-18).
ఇక్కడ ఉదహరించిన పరిస్థితి ఎంత నికృష్టంగా ఉందో చూడండి. భక్తుడు వెలిబుచ్చిన విశ్వాసం ఎంత శౌర్యవంతంగా ఉందో గమనించండి. నిజంగా చూస్తే అతడేమంటున్నాడంటే "నాకు భోజనం ఎక్కడనుండి వస్తుంది అని నేను తడుములాడు కోవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ, ఇల్లంతా గుల్లయినప్పటికీ, నా పొలమంతా బీడుభూమిగా మారినప్పటికీ, ఒకప్పుడు దేవుని సమృద్ధికరమైన దీవెనఫలాలు పండినచోట ఇప్పుడు దేవుడు పంపిన నాశనపు గుర్తులు కనిపించినప్పటికీ నేను యెహోవా యందు ఆనందించెదను."
ఈ మాటలు సువర్ణాక్షరాలతో రాయతగ్గవి. దేవుని కృపవల్ల ఈ మాటలన్నీ మన హృదయాలపై చెరగని శిలాక్షరాలు కావాలి. ఈ వాక్యంలో మనకు తోచే భావం ఏమిటంటే, భక్తుడు తన కష్టసమయంలో దేవుని వద్దకు పారిపోతానంటున్నాడు. ఈ దురదృష్టకరమైన సంఘటనల మధ్య అతడు ఆత్మలో నిబ్బరంగా ఉంటాడు. ఇన్ని ఆపదలు వాటిల్లుతున్నప్పటికీ దేవునిలో ఒక పరిశుద్ధమైన ఆనందాన్ని కలిగి ఉంటాడు. ఆయననుండి తనకేదో దక్కబోతున్నదని సంతోషంగా ఎదురుచూస్తుంటాడు. ఇది ఎంత గంభీరమైన నిశ్చయత! ఎంత కీర్తివంతమైన విశ్వాసం! ఎంత అజేయమైన ప్రేమ!
వానలో పాడే కోయిల గొంతు
మృదంగ ధ్వనుల వర్షబిందువుల వింత
ఎంత శ్రావ్యసంగీతం ఇదంతా
కష్టాలు రాకమానవు
ఆపడమెందుకు నీ గానం
వర్షం వెలిసే సమయం వచ్చేసింది
తేలిక మనసుతో బాధలనెదిరించేవాడు
వాటిని తేలిక చేసుకుంటాడు
కన్నీరు కార్చినవాడు
కమ్మని పాట వింటాడు
వానలో పాడే కోయిలమ్మా అర్థమైంది
నీ గీతంలోని మధురిమ అందులోని సందేశ గరిమ
మబ్బు ముసిరినప్పుడే పాటకు సమయం.