Skip to Content

Day 22 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

24 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను (మత్తయి 14:13).


వాయిద్య సమ్మేళనం మధ్యలో కొద్ది క్షణాలు మౌనం ఆవరిస్తుంది. వెంటనే సంగీతం మళ్ళీ మొదలవుతుంటుంది. ఈ మౌనంలో సంగీతమేమీ వినిపించదు. మన జీవితపు సంగీత సమ్మేళనంలో ఇలాటి మౌనాలు వచ్చినప్పుడు మనం రాగం అయిపోయిందని భ్రమపడతాము. దేవుడు తానే ఒక్కొక్కసారి మనకిష్టంలేని విశ్రమాన్ని, అనారోగ్యాన్ని, మన అంచనాల వైఫల్యాన్ని, ప్రయత్నాల పరాజయాన్నీ మనకి కలిగించి సాగుతున్న రాగం ఆగిపోయేలా చేస్తాడు. మన స్వరం మూగవోయింది అని చిన్నబుచ్చుకుంటాం. మన సృష్టికర్త ఆనందానికై జరిగే సంగీత కచేరిలో మన గొంతు కలపడం లేదే అని నిరాశపడతాము. సంగీత విద్వాంసులు ఈ మౌనం ఎంతసేపు ఉండాలో ఎలా తెలుసుకుంటారు? జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది. మౌనంలో కూడా వాళ్ళు తాళం వేసుకుంటూనే ఉంటారు. ఆ తాళం ప్రకారం ఖచ్చితమైన సమయానికి సంగీతం మళ్ళీ ఎత్తుకుంటారు.


మన జీవన రాగాలను కూడా దేవుడు తాళం వెయ్యకుండా ఆలపించడు. రాగం ఏమిటో తెలుసుకోవడం మన విధి. అది తెలిస్తే మౌనం ఎంతసేపు ఉంటుందో తెలుస్తుంది. ఈ మౌనాలు, సంగీతానికి అడ్డు రావు, తాళాన్ని అధిగమించవు, పాటలోని మాధుర్యాన్ని చెడగొట్టవు. మనం దేవుని వైపుకి చూస్తే దేపుడే మన రాగాలకు తాళం వేస్తూండడం చూస్తాము. ఆ తాళాన్ని అనుసరిస్తే మౌనం తరువాత వచ్చే స్వరాన్ని సరిగ్గా ఎత్తుకోగలుగుతాము. మౌనం వచ్చినప్పుడు సంగీతం ఆగిపోయిందని నిరుత్సాహపడితే వెనుకబడి పోతాము. మౌనంలో కూడా సంగీతం ఉందని మరచిపోవద్దు. జీవన రాగం ఆలపించడం చాలా కష్టమైన పని. దేవుడు మనకి ఎంతో ఓపికతో నేర్పిస్తున్నాడు. ఎంతకాలమైనా ఆ రాగాలను మనం నేర్చుకోవాలని ఎదురుచూస్తున్నాడు.


దైనందిన జీవితపు హడావుడిలోంచి

ప్రపంచ పోకడల పరుగు పందేలనుంచి

పరలోకపు నీడలోకి పరిశుద్ధుని జాడలోకి

కాసింత సేపు ఇటు రమ్మని కబురందిందా


బహుశా ఎడారి సీమల్లోకి

ఒంటరితనంలోకి దేవుని సన్నిధిలోకి

ఈ ఏకాంతంలో నాతో గడపమంటున్న

ఆయన కోమల స్వరం వినడానికి పిలుపు అందిందా


క్రీస్తు నడచిన ఇరుకు దారుల్లోకి

జీవజలం ప్రవహించే వాగుల్లోకి

దేవునితో కలిసి నడిచే ధన్యతలోకి

ఆయన ఇల్లు కనిపించే చేరువలోకి పిలుపు అందిందా


నీడ కోసం, నైర్మల్యం కోసం

దేవా నీకు వందనాలు

నీ ప్రేమ చూపిన రహస్య బాటల కోసం

చీకటిలో మాకు నేర్పిన చిత్రమైన పాఠాల కోసం


అన్నిటినీ అందంగా నిర్వహిస్తాడు

ఆయనతో ఉంటే మన భారం వహిస్తాడు

నీ సిలువనీడలో ఏకాంతంలో

నను పిలిచినందుకు దేవా ఇవే నా నివాళులు


Share this post