Skip to Content

Day 219 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

28 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

వారు ప్రార్థనచేయగానే వారు కూడియున్న చోటు కంపించెను; అప్పుడు వారందరు పరిశుద్దాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి ... అపొస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి (అపొ.కా. 4:31,33).


క్రిస్మస్ ఇవాన్స్ అనే గొప్ప దైవ సేవకుడు ఒకరోజు తన అనుభవాన్ని తన డైరీలో వ్రాసుకున్నాడు. ఒక ఆదివారం సాయంత్రం అతడు ఒక ఒంటరి దారిగుండా వెళ్తున్నాడు. ఉన్నట్టుండి తన ఆత్మీయస్థితి గురించి అతని హృదయం కలవరపడసాగింది. గుర్రాన్ని ఆపి ఒక చెట్టుకి కట్టేసి ఆ చుట్టుప్రక్కల అశాంతిగా పచార్లు చెయ్యడం ప్రారంభించాడు. తన జీవితాన్నంతటినీ ఒకసారి గుర్తు చేసుకున్నాడు. దేవుని ఎదుట దాదాపు మూడు గంటలపాటు విరిగిన హృదయంతో కనిపెట్టాడు. క్రమంగా దేవుని క్షమాపణ నిండిన ప్రేమ హృదయమంతా వెల్లివిరిసింది. దేవుని నుండి ఒక క్రొత్త పరిశుద్దాత్మ బాప్తిస్మం పొందాడు. సూర్యుడు అస్తమిస్తూ ఉండగా తిరిగి గుర్రం ఎక్కి తన పనిమీద వెళ్ళిపోయాడు. ఆ తరువాతి రోజు ఒక మైదానంలో కూడుకున్న గొప్ప జనసమూహానికి బోధించినప్పుడు గొప్ప ఉజ్జీవం బయలుదేరి ఆ ప్రాంతమంతటా వ్యాపించింది.


తిరిగి జన్మించినవాళ్ళని అడగదగ్గ అతి ప్రాముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, "నువ్వు పరిశుద్ధాత్మను పొందావా?"


ఆదిమ సంఘంలో ఇది ఒక కొలబద్ద.


నీ జీవితంలో పరిశుద్ధాత్మ నిండిందా

నీ హృదయంలో సంపూర్ణంగా నిండిందా

ఆయన నీమీదికి దిగివచ్చాడా

నీ రక్షకుని వెలుగు నీలో కనిపించేలా

నీలో రాజ్యమేలుతున్నాడా


సముద్ర కెరటాల్లా నీలో ఆయన ఎగిసిపడుతున్నాడా

అనుదినం నీతో కలసి ఉన్నాడా

నీ బ్రతుకులో మాధుర్యాన్ని నింపుతున్నాడా

నీ ప్రార్థనకి జవాబునిచ్చి నడిపిస్తున్నాడా

ఆయనతో నడవడం నీకు హాయిగా ఉందా


నీ ముంగిట అనుక్షణమూ ఉంటున్నాడా

నీకు బలాన్ని ప్రసాదిస్తున్నాడా

ఏదీ నీకు అసాధ్యం కాదని తెలియజేస్తున్నాడా

తన కుమారుని సాక్ష్యం నీలో మ్రోగుతుందా


నీలోని కుళ్లుని ఆకాశపు అగ్నితో కాల్చాడా

నీ ఆలోచనల్లో ఆయన నిండాడా

ఆయన సేవకోసం త్యాగం చెయ్యగలవా

ఆయన చిత్తం నెరవేర్చడమే నీకు అన్నపానాలైనాయా

ఆయన పంపిన చోటికి పరిగెత్తుతున్నావా?


నీ అహంనుండి స్వార్థంనుండి నిన్ను విడిపించాడా

అవసరంలో ఉన్న నీ అన్నని ఆదుకుంటున్నావా

యేసు సైనికుడిగా శ్రమలు భరించగలవా

క్రీస్తులో నీ నిరీక్షణ గట్టిదేనా

నీ ఓర్పు, సహనం, నమ్రత ఎలాటివి?


Share this post