- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
గిన్నెడు చన్నీళ్ళు మాత్రము (మత్తయి 10:42).
ఈ ప్రపంచంలో మనం బ్రతికేది ఒక్కసారే. నేను చేయదలుచుకున్న ఏ మంచి పనైనా, ఏ మనిషి కోసం, ఏ ఆత్మ కోసం చెయ్యాలనుకున్న ఏ రకమైన సేవైనా, ఏ జంతువు పట్ల చూపదలచుకున్న కరునైనా ఇప్పుడే చేయాలి. దాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు. వాయిదా వెయ్యకూడదు. ఎందుకంటే ఈ దారి వెంట మళ్ళీ రాము కదా.
నువ్వేం చేశావన్నది కాదు
చెయ్యకుండా విడిచి పెట్టిందేమిటి
నీ జీవన మలిసంధ్యలో నాలో
మంటపెట్టి మధన పెడుతున్నదిదే
ఆప్యాయంగా పలకలేకపోయిన అనునయ వాక్యం
రాయడానికి నిర్లక్ష్యం చేసిన లేఖ
పంపుదామని మర్చిపోయిన పూలమంజరి
ఎదుటివాడి దారికి అడ్డంగా ఉన్న శిల
బలముండి కూడా దాన్ని తొలగించకుంటే ఎలా
హృదయవేదనలో ఉన్నవాడికి
ఓదార్పుగా ఒక్కమాటా చెప్పలేదు
ఆప్యాయత ఆత్మీయత ఓ శీతల స్పర్శ
చేతనైవుండి కూడా తీరికలేదు
చిన్న చిన్న పనులు చెయ్యడం మానేశావు
జీవితకాలం స్వల్పమే
కష్టాలు కన్నీళ్ళు అధికమే
నీలోంచి జాలి కదలి రానంటోంది
కాలం తరలిపోతుంది
నువ్వేం చేసావన్నది కాదు
చెయ్యకుండా విడిచి పెట్టిందేమిటి
నీ జీవన మలి సంధ్యలో మనసులో
మంట పెట్టి మధన పెడుతున్నదిదే