Skip to Content

Day 209 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

28 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

యెహోవా తుపానులోను సుడిగాలిలోను వచ్చువాడు (నహూము 1:3).


నా చిన్నతనంలో ఒక ఎత్తయిన పర్వతంమీద ఉన్న ఒక సంస్థలో కొంతకాలం చదువుకొన్నాను. ఒకసారి ఆ కొండ మీద కూర్చుని లోయలోకి వ్యాపిస్తున్న తుపానుని చూశాను. అంతా కారుమబ్బులు కమ్మినాయి. భూమి ఉరుముల శబ్దానికి కంపించిపోతూ ఉంది. అందమైన ఆ లోయ అందవికారంగా అయిపోయింది. తిరిగి దాని అందం దానికి వస్తుందో రాదో అన్నంత మసకగా తయారైంది ఆ లోయ.


ఆ తుపాను కొంతసేపటికి లోయను దాటిపోయింది. మరుసటిరోజు నేను అక్కడే కూర్చుని "ఏదీ తుపాను, ఆ తుపాను తెచ్చిన చీకటంతా ఏది?" అని అడిగాననుకోండి. లోయలోని పచ్చగడ్డి ఇలా జవాబిచ్చేది "దాన్లో కొంతభాగం నాలో కలిసింది." కొండమల్లె బదులు పలికేది "దాన్లో కొంత నాలో ఇమిడింది" అని. ఆ లోయలో పండిన ఫలాలూ, నేలలోనుండి పెరిగిన ప్రతిదీ సమాధానమిచ్చేవి - "తుపానులో కొంతభాగం మాలోకిఇంకిపోయింది" అంటూ.


నీ ప్రభువులాగా నువ్వు తయారుకావాలని ఎప్పుడైనా కోరుకున్నావా? ఆత్మ ఫలం కోసం ఆశించావా? ప్రేమ ఇచ్చే నెమ్మది, నమ్రతల కోసం ప్రార్థించావా? అయితే నీ జీవితాన్ని క్రమ్ముకున్న తుపాను గురించి భయపడకు. తుపానులోనూ దీవెన ఉంది. "తుపాను తరువాత ఎన్నెన్నో పూలు పూస్తాయి. కాయలు కాస్తాయి. నువ్వూ ఫలిస్తావు.


ఆకాశపు మ్లాన వదనం

కార్చే కన్నీళ్ళు

పూలు పూయిస్తాయి

ఏడ్చే కళ్ళు లేకుంటే

ఆనందాలు కూడా ఉండవు


నీ బాధని ప్రేమించు

ఫలిస్తుందది తరువాతి కాలంలో

ఇంద్రధనుస్సుని చూడు

కన్నీళ్ళలో నుండి దేవుడు

ఎంత అందమైనదాన్ని చేశాడో చూడు.


Share this post