Skip to Content

Day 206 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

28 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

అందుకు యేసు - నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యికమీదట తెలిసికొందువు (యోహాను 13:7).


ఇప్పుడు మనం దేవుని కార్యంలో కొంతభాగం మట్టుకే చూస్తున్నాం. సగం కట్టిన ఇంటిని, సగం పూర్తియిన ప్రణాళికను చూస్తున్నాం. అయితే త్వరలో అంతా సంపూర్ణమైన సౌష్టవంతో నిత్యత్వపు ఆలయంగా నిలిచే రోజు వస్తుంది. ఉదాహరణకి, ఇశ్రాయేలీయుల రాజుల్లో అతి ఘనుడైన సొలొమోను కాలంలో లెబానోను పర్వతాల్లోకి వెళ్ళి చూడండి. ఠీవీగా తన తోటి చెట్లకు గర్వకారణంగా నిలబడి ఉన్న దేవదారు వృక్షాన్ని చూడండి. ఉత్తర వాయువులెన్నిటితోనో అది కుస్తీ పట్టింది. వసంత గాలులు దానిపై చిరునవ్వులు చిందాయి. వెన్నెల రాత్రులు దాని ఆకుల్ని మంచుతో తడిపాయి. దాని కొమ్మల్లో ఎన్నెనో, పక్షులు గూళ్ళు కట్టుకున్నాయి. అలసిన బాటసారులు, గొఱ్ఱల కాపరులెందరో మధ్యాహ్న వేళల్లో దాని నీడలో సేదదీర్చుకున్నారు. ఉన్నట్టుండి ఒకరోజున దాన్ని నరికి వెయ్యాల నిర్ణయం జరిగింది. తాతల కాలం నుండి ఆ అడవిలో జీవిస్తున్న ఆ వృక్షం ఒక్కరోజులో గొడ్డలి పాలవ్వనుంది.


మొదటి గొడ్డలి దెబ్బ పడింది. గరుకుగా ఉన్న దాని కాండంపై లోతుగా గాయమైంది. కొమ్మలొక్కక్కటే నేలరాలాయి. చివరికి చెట్టు మొత్తంగా పెద్ద శబ్దంతో మొదలుకంటూ కూలిపోయింది. ప్రకృతి ఆలయంలోని ఆ మూల స్థంభాన్ని అంత నిర్దాక్షిణ్యంగా కూల్చేయ్యడం, నాశనం చెయ్యడం చూసి మనం నివ్వెరపోతాం. ప్రవక్తతో బాటు గొంతెత్తి మిగతా చెట్లను ఉద్దేశించి విలపిస్తాం "చెట్లలారా, ప్రలాపించండి, దేవదా కూలిపోయింది."


కానీ కాస్తంత ఓపిక పట్టండి. ఆ బ్రహ్మాండమైన చెట్టు మొదలును హిరాము రాజు పనివాళ్ళు పర్వతం పైనుండి క్రిందికి దింపారు. మధ్యధరా సముద్రంలో తెప్పగా కట్టి పాలస్తీనా దేశానికి తరలించారు.


చివరికి యెరూషలేములో నిజదేవుని మందిరంలో మిలమిల మెరిసే దూలంగా అది సాక్షాత్కరించింది. అది చేరిన గమ్యాన్ని చూస్తే, ప్రభువైన యెహోవా దేవుని సన్నిధిని నెలకొని ఉన్న అతి పరిశుద్ధ స్థలంలో ఆ దూలం చేరిన వైనం చూస్తే "లేబానోనుకే గర్వకారణమైన ఆ వృక్షాన్ని ఎందుకు నరికేశారు?" అని మీరనగలరా? లేబానోను అరణ్యాన్ని అలంకరించిన ఆ ఆభరణం ఇప్పుడు మరింత మహిమాన్వితమైన ప్రదేశానికి అలంకారమైంది.


ఆ దేవదారు వృక్షం ప్రకృతిమాత ఒడిలో రాజసంతో నిలబడింది ఒకప్పుడు. అయితే తదనంతరం దానికి దక్కిన మహిమ ముందు దాని పుట్టింటి ఘనత ఏపాటిది?


అప్పటి ఆ దేవదారు వృక్షాల్లాటివే కదా మన హృదయాలు! దేవుని శ్రమల గొడ్డలి ఆ చెట్టును బోడిగా చేసి నరికేసింది. ఇదెందుకు జరిగింది అని మనం నిర్ఘాంతపోయి తలపట్టుకుని కూర్చోనక్కర్లేదు. ఎందుకంటే ఇలా చెయ్యడంలో ఆయనకు ఒక మంచి ఆలోచన ఉంది. తన పరలోకపు సీయోనులో వాటిని నిత్యమూ నిలిచి ఉండే మూల స్థంభాలుగా చేద్దామని ఆయన ఉద్దేశం. వాటిని "తన చేతిలో కిరీటంలాగా, ప్రభువు చేతిలో శ్రేష్ఠమైన ఆభరణం లాగా" చెయ్యాలన్నదే ఆయన అభిలాష.


నాకున్న సిలువ శ్రమలు

ఫర్వాలేదు

ఎందుకొచ్చాయో తెలియకపోయినా

చీకటిలో దేవా, నీ చెయ్యి

తోడుగా ఉంటే చాలు

నీ వెంట నడవగలిగితే అదే చాలు.


Share this post