Skip to Content

Day 202 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

28 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము (న్యాయాధి 6:39).


విశ్వాసంలో రకరకాల అంతస్తులు ఉన్నాయి. క్రైస్తవులుగా మన అనుభవం ఒక స్థాయిలో ఉన్నప్పుడు మనం ఒక విషయాన్ని నమ్మవలసి వస్తే ఏదో ఒక సూచక క్రియ గాని, మనలో ఏదో అనిర్వచనీయమైన అనుభూతి గాని కనిపిస్తేనే నమ్ముతాము. గిద్యోనులగానే మన దగ్గర గొర్రె బొచ్చులున్నాయి. అది చెమ్మగా అయితేనే మనలో నమ్మకం కలుగుతుంది. ఇది యథార్థమైన విశ్వాసమే గాని, పరిపూర్ణమైనది కాదు. ఈ విశ్వాసం కేవలం దేవుడి మాటే గాక ఏదైనా సూచకక్రియ కూడా ఉండాలని చూస్తుంది. అయితే మన అవగాహనతో నిమిత్తం లేకుండా పూర్తిగా దేవుని మాటమీదే నమ్మకముంచడం విశ్వాసంలో చాలా పై మెట్టు. ఇలా నమ్మడం ధన్యకరం.


మూడో మెట్టు కూడా ఉంది. మొదటిదేమిటంటే ఒక పని జరుగుతుందని మన మనస్సుకి నమ్మకం కుదిరితేనే విశ్వాసముంచడం. రెండవది అలాటిదేమీ లేకపోయినా దేవుని మాట మీదే ఆధారపడి విశ్వాసముంచడం. మూడో మెట్టు ఏమిటంటే పరిస్థితులు, మన అనుభూతులు. బయటికి కనిపించే తీరు, మనుషుల అభిప్రాయాలూ, మన ఊహలూ అన్నీ ఆ పనికి వ్యతిరేకంగా కనిపించినపుడు దేవునినీ, ఆయన వాక్కునీ నమ్మడం. అపొస్తలుల కార్యములు 27:20,25లో పౌలు ఇలాటి విశ్వాసాన్నే కనపరిచాడు.


కొంతకాలం "సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్దగా మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగ పోయెను." ఇవన్నీ జరుగుతున్నప్పటికీ పౌలు వారితో అంటున్నాడు "అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి; నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను."


కనబడేదంతా వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతున్నప్పటికీ మనం దేవుని మాటలో నమ్మకం ఉంచేలా దేవుడు మనకు విశ్వాసాన్ని అనుగ్రహిస్తాడు గాక.


నమ్మకముంచాల్సిన సమయమేది

అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడా?

అన్నింటిపై మనం గెలుస్తున్నప్పుడా?

బ్రతుకే స్తుతి పాటైనప్పుడా?

కాదు, కాదెంత మాత్రమూ

అలలు ఎగిసి పడేటప్పుడు

తుపాను మబ్బులు కమ్ముకొచ్చినప్పుడు

ప్రార్థనే ఆహారం, కన్నీళ్ళే దాహమైనప్పుడు


నమ్మకముంచాల్సిన సమయమేది?

ఎప్పుడో రాబోయే కాలంలో

పాఠాలన్నీ నేర్చుకున్న తరువాత

కష్టాలపాలై ప్రార్థనలు చేసి

స్థిర విశ్వాసం పొందిన తరువాతా?

కాదు, కాదెన్నటికీ కాదు

ఇప్పుడే ఈ దైన్యంలోనే

చితికిపోయి చినిగిపోయి

ధూళిలో కలిసినప్పుడే


నమ్మకముంచాల్సిన తరుణమేది?

మిత్రులంతా సఖ్యత చూపుతున్నప్పుడా

సౌఖ్యాలు కురిసేటప్పుడా

నేను చేసే ప్రతిదానిలో

నాకు మెప్పు కలుగుతున్నప్పుడా

కాదు, కాదెంతమాత్రమూ

అంతా నన్ను ఏకాకిని చేసినప్పుడు

ఆధారాలన్నీ కూలిపోయినప్పుడు


నమ్మకముంచాల్సిన తరుణమేది?

ఆశలు బావుటాలై ఎగిరినప్పుడా

ఆకాశంలో కాంతి నిండినప్పుడా

హృదయంలో హర్షం పొందినప్పుడా

కాదు, కాదెంతమాత్రమూ

సంతోషం అడుగంటినప్పుడు

దిగులు మెడను వంచినప్పుడు

దేవుడు తప్ప మిగతాదంతా

మరణం, శూన్యమైపోయినప్పుడు


Share this post