- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుకతీయక యీ కార్యము చేసినందున . . . నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను . . . నీవు నా మాట వినినందున (ఆది 22:16, 18).
ఆ రోజునుండి ఈ రోజుదాకా మనుషులు ఒక విషయాన్ని పదేపదే చూస్తూ నేర్చుకుంటూ వస్తున్నారు. అదేమిటంటే, దేవుని ఆజ్ఞ మేరకు తమకు అత్యంత ప్రీతిపాత్రమైన ఒక వస్తువును ఆయనకు సమర్పించినట్టయితే అదే వస్తువు వాళ్ళకి వెయ్యి రెట్లు తిరిగి లభిస్తుంది. అబ్రాహాము దేవుని పిలుపు విని తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చేశాడు. దీనితో "ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడౌతాడు. తన వంశం విస్తరిస్తుంది" అన్న ఆశలన్నీ సమూలంగా తుడిచిపెట్టుకు పోయినై. కానీ ఆ పిల్లవాడు తిరిగి తనకు దక్కాడు. కుటుంబం నక్షత్రాల్లాగా, ఇసుక రేణువుల్లాగా విస్తరించింది. కాలం పరిపూర్ణమైనప్పుడు ఆ కుటుంబంలోనుంచే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు.
తన పిల్లలు చేసే నిజమైన త్యాగాలను దేవుడు స్వీకరించే తీరు ఇదే. మనం అన్నీ ఆయనకిచ్చేసి పేదరికాన్ని కొనితెచ్చుకుంటాము -ఆయన మనకు సంపదలు పంపిస్తాడు. మనకు చేతకాదనుకుని ఓ గొప్ప సేవాభారాన్ని మనం త్యజిస్తాం - అందుకాయన మనం కలలో కూడా ఊహించని మరింత గొప్ప సేవా బాధ్యతను మనపరం చేస్తాడు. మనకున్న ఆశలన్నీ వదిలేసుకుని రాగద్వేషాలకు అతీతులమౌతాం. ప్రతిగా ఆయన అపురూపమైన ఆనందాలు నిండిన సమృద్ధి జీవితాన్ని అనుగ్రహిస్తాడు. అవన్నీ కాక మన కిరీటంగా క్రీస్తు మనతో ఎప్పుడూ ఉన్నాడు. అబ్రాహాము చేసినట్టు ఆ సంపూర్ణమైన త్యాగం మనం చెయ్యకపోతే క్రీస్తులో మనకు దొరికే సమృద్ధి జీవితాన్ని ఎన్నటికీ రుచి చూడలేం. క్రీస్తు జీవితచరిత్రకు ఇహలోకపరంగా మూలపురుషుడైన అబ్రాహాము దీన్నంతటినీ తన ఒక్కగానొక్క కుమారుణ్ణి వదులుకోవడం ద్వారా ప్రారంభించాడు. పరలోకపు తండ్రి కూడా ఇదే విధంగా తనకున్న ఏకైక కుమారుణ్ణి త్యాగం చేశాడు కదా. ఈ విధంగా కాక మరేవిధంగానూ మనం ఆ కుటుంబానికి వారసులం కాలేం. మనకు అతి ప్రియమైనదాన్ని అవసరమైతే దేవునికి ఇచ్చివేయడం ద్వారానే తప్ప ఆ కుటుంబంలో సభ్యులుగా మనకు అన్ని సౌకర్యాలూ, హక్కులూ సమకూరవు.
దేవుడు మననుండి ఏదన్నా అడిగాడంటే సాధారణంగా అది మనకు చాలా బాధాకరంగా ఉండేదై ఉంటుంది. అయితే తిరిగి మనలో జీవం నిండాలంటే, పరలోకానికి ఆరోహణమయ్యే కొండకు చేరాలంటే మనం తప్పనిసరిగా గెత్సెమనే తోట, సిలువ, సమాధి మార్గాల్లోగుండా ప్రయాణించాల్సి ఉంది.
ఓ మానవ హృదయమా, అబ్రాహాము అనుభవం ఆయనకొక్కడికే పరిమితం అనుకోకు. అలా మరెన్నడూ ఎక్కడా జరగదని అనుకోకు. ఎంత కష్టమైనా, నిష్టూరమైనా దేవునికి లోబడడానికి సిద్దపడిన ఆత్మలన్నిటితో ఆయన వ్యవహరించే పద్ధతికి ఇది ఒక మచ్చుతునక మాత్రమే. నువ్వు ఓపికతో సహించి కనిపెట్టిన తరువాత వాగ్దాన ఫలం నీకు దక్కుతుంది. త్యాగానికి బదులుగా లోకాతీతమైన దీవెనలు దొరుకుతాయి. దేవుని ఆశీర్వాదాల నదులు కట్టలు తెంచుకొని కృపతో, సకల సంపదలతో నిన్ను నిలువునా ముంచెత్తుతాయి. దారి కనిపించని పొగమంచు మూసినప్పటికీ ధైర్యంగా దేవుని పక్షాన ముందడుగు వేసే వారికోసం దేవుడు చెయ్యని సహాయం అంటూ ఏమీ లేదు. అలా అడుగు వేసేవాళ్ళు తమ పాదం బండమీద పడిందని తెలుసుకుంటారు.