- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు (రోమా 4:17).
అంటే అర్థమేమిటి? అబ్రాహాము మనందరికి తండ్రి ఎలా అయ్యాడు? అతడు దేవుని మాటను అక్షరాలా నమ్మడానికి వెనుకాడలేదు. అంత వృద్ధాప్యంలో తాను తండ్రి కావడం అన్నది అసాధ్యమే మరి. అది అసంభవమే. కానీ పిల్లవాడు పుట్టక మునుపే దేవుడు అతణ్ణి "అనేక జనాంగాలకు తండ్రి" అని పిలిచాడు. సందేహించకుండా దేవుడు తనకు చెప్పాడు కాబట్టి అబ్రాము తన పేరును "అబ్రాహాము"గా మార్చుకున్నాడు. ఇదే విశ్వాసం. అంటే దేవుడు చెప్పిన దానిని నమ్మి రూఢిపరచడం. ఎదుట గుంట ఉన్నదో, లోయ ఉన్నదో చూసుకోకుండానే విశ్వాసం అడుగు ముందుకేస్తుంది. దాని అడుగు చదునైన బండరాతి మీదనే పడుతుంది.
దేవుడు నీకు ఏదైతే ఉంది అని చెప్పాడో అది నీకు ఉంది అని నమ్మి ఇతరులతో చెప్పు. ఆయన నువ్వు నమ్మేదంతా వాస్తవం చేస్తాడు. అయితే అది నిజమైన విశ్వాసమై ఉండాలి. దేవునిపైన ఆ విశ్వాసంలోనే నీలో ఉన్నదంతా కేంద్రీకృతమవ్వాలి.
నమ్మికద్వారా తప్ప మరి దేనిమూలంగానూ జీవించడం ఇష్టపడకండి.
కళ్లకు కనిపించే ప్రతి దీపమూ ఆరిపోయినా నింగిలోని ప్రతి నక్షత్రానికి గ్రహణం పట్టినా, అంతా ఇడుములు, చీకటి కప్పేసినా కేవలం దేవుడు నీలో విశ్వాసం అనే దీపాన్ని వెలిగించి తన తేజస్సునూ, కాంతినీ నీ హృదయంలో నింపితే చాలు, నీకేమీ పర్వాలేదు.
నువ్వు వాలిన అపనమ్మకం కొమ్మనుండి దూకెయ్యాలి. ఇహలోకపు క్షేమాలనే గూడును వదిలి బయటికి రావాలి. విశ్వాసం అనే రెక్కలు విదిల్చి ఎగరాలి. పక్షి పిల్లలు కూడా మొదటిసారి బయటికి వచ్చినప్పుడు అవి అంతకు ముందు ఎప్పుడూ ఎగిరి ఉండలేదు కదా. ఒక సమయం వస్తుంది ఎగరడానికి, నేలరాలిపోతానేమోనని భయం వాటికి ఉండవచ్చు, కాని అవి క్రింద పడవు. వాటి రెక్కలు వాటిని గాలిలో నిలబెడతాయి. ఒకవేళ రెక్కలకింకా బలం రాక అవి పడిపోతూ ఉంటే తల్లి పక్షి వాటి క్రిందుగా ఎగిరివెళ్ళి తన రెక్కల మీద వాటిని సురక్షితంగా ఉంచుతుంది. దేవుడు కూడా నిన్ను అలాగే ఎత్తిపడతాడు. కేవలం నమ్మిక మాత్రం ఉంచు. "నిన్నాయన ఎత్తి పట్టుకుంటాడు. " అది సరే, నువ్వు ఇలా అనవచ్చు. "క్రింద ఆధారమేమీ లేదే, ఎలా దూకను?" ఆ పక్షి పిల్లకి కూడా ఇదే సందేహం ఉంటుంది కదా. ఏమీ ఎందుకు లేదు? గాలి ఉంది కదా. గాలి మనమనుకున్నంత బలహీనమైనది కాదు. పక్షుల్ని శూన్యంలో నిలబెట్టేది గాలే కదా. నీకు తెలుసు, దేవుని వాగ్దానాలు మనకున్నాయి. అవి బలహీనమైనవి ఎంతమాత్రమూ కాదు. "నా బలహీనమైన పేద హృదయానికి అంత శక్తి కలుగుతుందని నాకనిపించడం లేదు. ఏమిటీ, దేవుడన్నాడా శోధనలకు గురై లొంగిపోయే నా ప్రవృత్తి సంఘర్షణలో జయశీలిగా నిలబడుతుందని? నిలబడగలదని దేవుడు నిజంగా మాటిచ్చాడా? గజగజ వణికిపోతున్న హృదయానికి శాంతి దొరుకుతుందని అన్నాడా? నిజంగా అని ఉంటే అది అబద్ధం కానేరదు గదా. ఆయన అలా అని ఉంటే చెయ్యకుండా ఊరుకోడు గదా." నిశ్చయమైన ఒక వాగ్దానం నీకు దొరికితే దాన్ని అక్షరాలా నమ్ము. ఉన్నది ఉన్నట్టుగా నెరవేరుతుందని రూఢిపర్చుకో. ఈ ప్రమాణ వాక్యం నీ పక్షాన ఉంది. వాక్యమే కాదు, ఆ వాక్యాన్ని పలికిన దేవుడే నీకున్నాడు. నిజంగా చెబుతున్నాను ఆయన్ని నమ్ము.