Skip to Content

Day 193 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

27 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

నేను నడచుమార్గము ఆయనకు తెలియును. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును (యోబు 23:10).


తపానుల్లోనే విశ్వాసం అభివృద్ది చెందుతుంది. తుపానులగుండా నడచివచ్చిన ఆత్మలకు ఈ సత్యం చక్కగా తెలుస్తుంది.


విశ్వాసం అనేది దేవుడిచ్చిన జ్ఞానేంద్రియం. దీన్ని ఉపయోగిస్తే అదృశ్యమైన విషయాలు కూడా తేటగా కనిపిస్తాయి. అసంభవం అనుకున్న విషయాలు జరుగుతాయి. అది అలౌకికమైన విషయాల పరిథిలో తిరుగులాడుతూ ఉంటుంది.


ఇది తుపాను వేళల్లో అభివృద్ది చెందుతూ ఉంటుంది. అంటే ఆత్మీయ ప్రపంచంలో వాయుగుండాలు ఏర్పడి తుపాను వచ్చినప్పుడన్నమాట, గాలి, నీరూ లాంటి పంచభూతాల అల్లకల్లోలం వల్ల తుపానులు ఏర్పడతాయి. ఆత్మ సంబంధమైన తుపానులైతే చీకటి శక్తులతో పెనుగులాడడం వల్ల ఏర్పడతాయి.


అలాటి వాతావరణంలోనే విశ్వాసానికి ఆయువుపట్టు దొరుకుతుంది. అది ఫలించి అభివృద్ధి పొందుతుంది.


దృఢమైన వృక్షాలు అడవుల నీడల్లో పెరగవు. అవి ఆరుబయట గాలీ, వర్షం తగిలేచోట పెరుగుతూ గాలికి అటూ ఇటూ ఊగుతూ, వంగుతూ లేస్తూ, మహా వృక్షాలుగా తయారవుతాయి. కార్మికులు ఇలాటి చెట్ల కలపతోనే తమ పరికరాలు చేసుకుంటారు. కలప పనివాళ్ళు ఇలాటి చెట్లకోసమే వెదకుతారు.


ఆత్మీయంగా బలిష్టులైనవాళ్ళను మీరెప్పుడైనా చూస్తే ఒక విషయం గుర్తుంచుకోండి. వాళ్ళ చెంతకు మీరు చేరాలంటే మీరు నడిచి రావలసింది వసంతకాలపు పుష్పాలు విరిసిన వెలుగుబాటపై కాదు. ఇరుకుగా, ఎక్కలేనంత ఏటవాలుగా, రాళ్ళమయంగా ఉండి నరలోకపు తుపాకిమందు పేలుతూ నిన్ను ఎగరగొట్టే ప్రమాదాలు నిండి ఉన్న దారి. ఆ దారిలో పదునైన రాళ్ళు గాయాలు చేస్తాయి. పొడుచుకు వచ్చిన ముళ్ళు నీ నుదిటిపై గీసుకుంటాయి. విష జంతువులు దారికి ఇరుప్రక్కలా బుసలు కొడుతుంటాయి.


అది విచారం, సంతోషం ఏకమైన దారి. గాయాలు, వాటిని మాన్పే మందు కూడా ఆ బాటలోనే ఉన్నాయి. కన్నీళ్ళు, చిరునవ్వులు, శ్రమలు, విజయాలు, సంఘర్షణలు, గెలుపులు, కష్టాలు, ఆపదలు, పీడలు, అపార్థాలు, ఇక్కట్లు, బాధలు .... వీటన్నిటిలో గుండా మనల్ని ప్రేమించే దేవుడు మనలను విజేతలుగా నిలబెడతాడు.


"తుపానుల్లో" ప్రళయకాల పెనుతుపాను నట్టనడుమ శ్రమ అనే పెనుగాలిక వెరచి నువ్వు వెనక్కి తగ్గుతావేమో ముందుకి సాగిపో! నీ శ్రమలన్నింటి మధ్యా నిన్ను కలుసుకోవడానికి దేవుడు అక్కడ ఉన్నాడు. ఆయన తన రహస్యాలను అక్కడ నీకు చెప్తాడు. వాటిని వింటే నువ్వు వెలిగిపోయే వదనంతో, నరకలోకంలోని దయ్యాలన్నీ కలిసినా కదిలించలేని విశ్వాసంతో బయటికి వస్తావు.


Share this post