Skip to Content

Day 190 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

27 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని (యెషయా 48:10).


ఈ మాట కొలిమిలోని వేడినంతటినీ చల్లార్చే చల్లని వర్షపు జల్లులాగా ఉంది కదూ! అవును, దీనిపై అగ్నికీ, వేడిమికీ ఏ అధికారమూ లేదు. శ్రమలు రానీ దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. పేదరికమా, నువ్వు నా గుమ్మంలోనే కాచుకుని ఉంటే ఉండు. దేవుడు నాతో నా ఇంట్లోనే ఉన్నాడు. ఆయన నన్ను ఎన్నుకున్నాడు. "అనారోగ్యమా, నువ్వు అడ్డగించగలిగితే అడ్డగించు. కాని ఔషధం నా దగ్గర సిద్ధంగా ఉంది. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఈ కన్నీటిలోయలో నాకేమి సంభవించినా సరే, దేవుడు నన్ను ఎన్నుకున్నాడని మాత్రం నాకు తెలుసు."


క్రైస్తవుడా, భయపడకు, యేసు నీతో ఉన్నాడు. నీ అగ్ని పరీక్షలన్నింటిలోను ఆయన ప్రత్యక్షతే నీకు ఆదరణ, క్షేమం. తన స్వంతానికి ఎన్నుకున్న వాళ్ళెవరిని ఆయన వదిలెయ్యడు. "భయపడకుడి, నేను సదాకాలము మీతో ఉన్నాను" అన్నదే ఆయన ఎన్నుకున్న వాళ్ళకు ఆయన ఇచ్చిన మాట. ఇబ్బందుల కొలిమిలో వాళ్ళకిదే ఆదరణ.


నాలో అగ్ని కొలిమి కాలుతోంది

ని ఊపిరి ఊదుతోంది

మనసంతా సలసలా కాగుతోంది

వణికిపోతూ మాడి మసైపోతోంది

ప్రచండ వేడిలో నిశ్చలంగా ఉన్నాను

"దేవుని చిత్త ప్రకారమే" అని తల వంచాను


ఎర్రగా కాలిన నా హృదయాన్ని

బండ మీద పడేసాడు

తన రూపులోకి తేవాలని

బరువైన సుత్తితో బాదాడు

సుత్తి దెబ్బలకి నిశ్చలంగా ఉన్నాను

"దేవుని చిత్తప్రకారమే" అని తల వంచాను


ఎర్రగా కాలిన నా హృదయాన్ని

మెత్తబడ్డ మనసుపై

పడుతున్నప్రతి దెబ్బకి

నిప్పురవ్వలెగిరాయి, చల్లార్చి

మళ్ళీ కొలిమిలో వేసి కాల్చాడు

అంతా భరిస్తూ నిశ్చలంగా ఉన్నాను

"దేవుని చిత్త ప్రకారమే" అని తలవంచాను.


సణగడమేందుకు బాధ పూర్తయ్యే

సమయం త్వరగానే వస్తుంది

నాపై దేవుని పని రేపే పూర్తవుతుంది

అందుకే నమ్మికతో

ఆయన పై భారంవేసి నిశ్చలంగా ఉన్నాను

"దేవుని చిత్తప్రకారమే" అని తలవంచాను.


శ్రమ అనేది మెడకి వ్రేలాడేసిన సమాధిరాయిలాగా అనిపిస్తుంది. కానీ నిజానికి అది ముత్యాలకోసం సముద్రం అడుగున వెతికే ఈతగాడు ఆ అగాధంలో ఉండగలగడానికి చేసే సహాయం లాంటిది.


Share this post