Skip to Content

Day 189 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

27 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు (యెషయా 40:31).


సృష్టి ఆరంభంలో పక్షులకి రెక్కలెలా వచ్చాయి అన్నదానిపై ఒక కథ ఉంది. మొదట్లో పక్షులకు రెక్కలు ఉండేవి కాదట. దేవుడు రెక్కల్ని తయారుచేసి రెక్కలు లేని ఆ పక్షుల ఎదుట పెట్టి "రండి, ఈ బరువుల్ని తగిలించుకుని మొయ్యండి" అన్నాడట.


పక్షులకి అప్పటికే రంగు రంగుల ఈకలున్నాయి. పాటలు పాడే స్వరముంది. వాటి ఈకలు ఎండలో మెరుస్తున్నాయి. కాని గాలిలో ఎగరలేవు. తమ ఎదుట పడి ఉన్న బరువుల్ని తగిలించుకోవడానికి మొదట్లో సందేహించినా త్వరలోనే లోబడినాయి. ముక్కులతో ఆ రెక్కల్ని తమ భుజాల మీదికి ఎత్తుకొని మొయ్యడం మొదలుపెట్టాయి.


కొంతకాలంపాటు ఆ బరువు చాలా కష్టంగా ఉండేది. కాని రానురాను అలవాటు పడిపోయాక వాటితో తమ గుండెలని కప్పుకునేవి. త్వరలోనే వాటి చిన్న శరీరాలకు ఆ రెక్కలు అంటుకుపోయాయి. మరి కొంతకాలానికి వాటిని ఉపయోగించడం ఎలాగో వాటికి తెలిసిపోయింది. వాటి సహాయంతో గాలిలోకి ఎగరసాగాయి. .


మనమూ రెక్కల్లేని పక్షులమే. మనకున్న బరువు బాధ్యతలే మనం పరలోకం వైపుకు ఎగిరిపోవడానికి దేవుడు మనకిచ్చిన రెక్కలు. మనం ఆ బరువుల్ని చూసి భయపడి వాటిని భుజాన వేసుకోవడానికి నిరాకరిస్తాం. కాని వాటిని ఎత్తుకుని మన హృదయాలకి కట్టుకుంటే అవే మన దేవుని చెంతకు ఎరిగిపోయే రెక్కలౌతాయి.


ఏ భారాన్నైనా మనం సంతోషంగా, ప్రేమపూర్వకంగా ఎత్తుకుంటే అది మనకి ఆశీర్వాదంగానే పరిణమిస్తుంది. మనం చెయ్యాల్సిన పనులు మనకు దీవెనలుగా ఉండాలనే దేవుడు నిర్దేశించాడు. ఏదైనా బరువును ఎత్తుకోవడానికి మనం మన భుజాలను వంచడం లేదంటే మన అత్మీయాభివృద్ధికి ఒక అవకాశాన్ని తిరస్కరిస్తున్నామన్నమాట.


దేవుడు తన స్వహస్తాలతో మన వీపుకి ఏదన్నా బరువుని కడుతున్నాడంటే అది ఎంత మోయరానిదైనా అది ఆశీర్వాదమేనన్నమాట.


Share this post