- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
ఏమి చేయుటకును మాకు తోచదు; నీవే మాకు దిక్కు (2 దిన 20:12).
దేవుని నిబంధన మందసం మీద పడకూడని చేతులు పడినందువల్ల ఇశ్రాయేలులో ప్రాణనష్టం వాటిల్లింది. ఆ చేతులు వేసిన వ్యక్తి మంచి ఉద్దేశంతోనే వేశాడు. గతుకుల బాటలో ఎద్దులు నడిచిపోతూ ఉంటే మందసం జారీ క్రిందపడకుండా పట్టుకున్నాయా చేతులు. అయితే దేవునికి చెందినదాన్ని ఆ చేతులు మానవ అహంకారంతో కలిగిన తొందరపాటువల్ల ముట్టుకున్నాయి. వెంటనే నిర్జీవంగా ఆ శరీరం నేలకూలింది. మన తెలివిని ఉపయోగించి దేవునికి సంబంధించిన వాటిని సరిచెయ్యాలనుకునేవాడు విశ్వాస రహితమైన వ్యక్తి.
మనం దేవునిపై ఒక బాధ్యతను వదిలేసినప్పుడు ఇక పూర్తిగా మన చేతులు దులిపేసుకోవాలి. మన సహాయం, జోక్యం లేకపోతే ఆయన బాధ్యతని బహు చక్కగా నిర్వహించగలడు. దేవునిలో నిశ్చింతగా ఉండండి. ఆయన కోసం ఓపికతో కని పెట్టండి. తన అన్యాయాల్లో వర్ధిల్లేవాణ్ణి చూసి వ్యసనపడకండి. కుయుక్తులు పన్ని కాలం గడుపు కునేవాణ్ణి చూసి అసూయపడకండి.
కొన్నిసార్లు అంతా అంతమైపోయినట్టు అనిపిస్తుంటుంది. దేవునికి తెలుసు ఈ విషయం. కాని ఆయనను తన ఇష్టం వచ్చిన సమయంలో ఇష్టం వచ్చిన రీతిలో పని చెయ్యడానికి ఆయనకు పూర్ణాధికారం ఇచ్చి ఆయనపై నమ్మకముంచి మనం ఓపికతో కనిపెడితే సరైన సమయంలో ఆయన పూనుకుంటాడు.
కొన్నిసార్లు మేదలకుండా ఊరుకోవడంలో వివేకం ఉంది. జోక్యం కలుగజేసుకో కుండా ఉండవలసిన సమయంలో కిందా, మీదా పడి పనిచెయ్యడం కొన్నిసార్లు హానికరం కూడా. ఎందుకంటే తన సర్వాధికారంతో దేవుడు ఆ పనిని తన ఆధీనం చేసుకున్నాడు.
నిర్ఘాంతపోయి విన్నవించుకున్నాను
"ప్రభూ సరిచెయ్యి దీన్నంటూ"
నా తలకి మించిన పని ఇది
వేలు పెట్టే సాహసం లేదు
నా చెయ్యి వణకుతుందేమో
వస్తువు జారిపడి పగులుతుందేమో
దానికి నువ్వే తగినవాడివి
సందేహంతో అడిగాను
"ప్రభూ వివరించు దీన్నంటూ"
దేనివల్ల నాకు లాభం?
తెలుసుకునే తెలివి లేదు
వెళ్ళగలిగే దారీ కానరాదు
నీకన్నీ తెలుసు నాకు వివరించి తెలుపు
చిక్కుముడులు పడిపోయిన జీవితాన్ని ప్రభువు చేతిలో పెడితే ఇక ఆందోళన అక్కర్లేదు.