Skip to Content

Day 175 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

26 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా? (యెషయా 45:11) (ఆజ్ఞాపించండి అని భావం).


యేసుప్రభువు తన అద్భుత కార్యాలు చేసేటప్పుడు ఈ వాక్యభాగాన్ని ఆధారం చేసుకున్నాడు. యెహోషువకి విజయ ఘడియలు సమీపించగా, శత్రునాశనం సంపూర్ణమయ్యేలా తన కత్తిని ఆకాశం వైపుకి చాపి సూర్యుడా అస్తమించకు అని ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఈ వాగ్దానాన్నే ఉపయోగించుకున్నాడు.


మూడున్నర సంవత్సరాలు ఏలీయా ఆకాశపు వాకిళ్ళను మూసి వర్షం లేకుండా చేసిన సందర్భం దేవుని కార్యాలను గురించి ఆయన్నాజ్ఞాపించినట్టే కదా.


మరణశయ్య పైన ఉన్న వ్యక్తి దగ్గర మోకాళ్ళూని మరణాన్ని దూరంగా తరిమిన మార్టిన్ లూథర్ కి ఆ అధికారాన్నిచ్చింది ఈ మాటే.


దేవుడు మనల్ని తనతో ఒక ఉత్కృష్టమైన సంబంధాన్ని కలిగి ఉండడానికి పిలుస్తున్నాడు. "ఆకాశ విశాలాన్ని నా చేతులతో పరిచాను. దానిలోని నక్షత్ర సమూహాలను ఆజ్ఞాపిస్తున్నాను" అంటూ యెహోవా దేవుడనే మాటలు మనందరికీ తెలుసు. అయితే ఇలాటి దేవుడు మన ఆజ్ఞలను స్వీకరించడానికి సిద్దపడి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఏమిటీ విపరీతం. ఇలాటి సంబంధం ఎంత ఆశ్చర్యకరం"


దేవుణ్ణి ఆజ్ఞాపించడానికి మనకున్న అవకాశానికీ, నత్తినత్తిగా అవిశ్వాసంతో మనం చేసే సగం సగం ప్రార్థనలకి పొంతన ఎక్కడ? నమ్మకం లేక మనం చేసిన ప్రార్థనలనే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే ఇక వాటికి పదునెలా ఉంటుంది?


తన ఇహలోకపు అవతారంలో దేవుడైన యేసుక్రీస్తు చాలాసార్లు మనుషుల ఆజ్ఞలకోసం అడిగాడు. యెరికో పట్టణంలో ప్రవేశిస్తూ ఉన్నప్పుడూ గ్రుడ్డివాళ్ళు ఎదురైతే తనకై తాను ఏమీ చెయ్యలేదు.


"నేను మీకు ఏమి చెయ్యాలని కోరుతున్నారు?" అంటే "చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను" అన్నట్టే కదా.


తన మహిమల తాళపు చెవిని సురోఫెనికయ స్త్రీకి అప్పగించి "నీ ఇష్టం. ఏం కావాలో తీసుకో" అన్నట్టు యేసుక్రీస్తు ప్రవర్తించలేదా.


తన పిల్లలను ఎలాటి ఉన్నత స్థానానికి వాగ్దానం ద్వారా దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడో, మన మానవ జ్ఞానం అర్ధం చేసుకోగలదా? ఆయన ఏమంటున్నాడు "నా మహిమా ప్రభావాలన్నీ నీ ఆధీనంలో ఉన్నాయి. నా నామం చొప్పున నువ్వు ఏది అడిగినా నేను నెరవేరుస్తాను"


కొండతో చెప్పండి

కడలిలో పడమని

గుండెలో శంక వదలండి

తండ్రి మాటని నమ్మండి

అడ్డమైన కొండల్ని

తండ్రి పేరట అదిలించండి


హూంకరించిన అడ్డుగోడను

తృణీకరించండి మౌన ప్రార్థనతో

నేలకూలిన బురుజుల్ని చూసి

జయగీతాలు పాడండి

విశ్వాసంతో విశ్రమించండి

ఇత్తడి తలుపులు ఇనుప గడియలు

విశ్వాసి సాగిపోవడానికి వింతగా తెరుచుకుంటాయి

ఇది జరుగుతుంది ఆధీనుడౌతాడు పగవాడు


విలువైన నెత్తురు తెచ్చిన

విమోచన రాత్రిని పిలవండి

త్రిత్వం ఏకమై తెస్తుంది దాన్ని

ఇది జరుగుతుంది నమ్మండి వాక్యాన్ని

అడ్డమైన కొండలి తండ్రి పేర అదిలించండి


విశ్వాసాన్ని చేబూని

సందేహాన్ని త్యజించి

అసాధ్యాలను సాధ్యం చేసే

అద్భుతమైన శక్తిని ధరించి

అన్నింటినీ జరిగించండి

వాక్యంలో నిలబడి

అడ్డమైన కొండల్ని తండ్రి పేర అదిలించండి


Share this post