- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
ఆయన యింట ఉన్నాడని వినవచ్చినప్పుడు (మార్కు 2:2).
సముద్రం అడుగున పోలిప్లు కాల్షియం ధాతువులతో తమ కోసం బ్రహ్మాండమైన ప్రవాళాలను నిర్మించుకుంటాయి. ప్రవాళాలు అనేవి గవ్వల్లా విడివిడిగా ఉండకుండా మొత్తంగా కలిసిపోయి ఒక్కోసారి పెద్ద పెద్ద ద్వీపాలుగా సముద్రం మధ్య భాగంలో ఏర్పడుతుంటాయి. పోలిప్ల వంటి అత్యల్పమైన జీవులకి తాము నిర్మించుకునే గూళ్ళవలన క్రొత్త ద్వీపాలు ఏర్పడతాయని తెలియదు. కాని క్రమక్రమంగా దానిమీద జంతువులు నివసిస్తాయి. మొక్కలు పెరుగుతాయి.
దేవుని సైన్య సమూహంలో నీ స్థానం ఎక్కడో అట్టడుగున ఉంటే సనుగుకోకు. ఫిర్యాదులు చేయకు. దేవుని చిత్తానికి ఎదురు చెప్పడానికి ప్రయత్నించకు. దేవుడు నిన్నక్కడ ఉంచాడు అంతే. సముద్రంలోని పోలిప్ జీవులు లేకుండా పగడాల ద్వీపాలు "కోరల్స్"ను ఎవరు కట్టగలరు? దేవుడు ఆత్మీయ పోలిప్లుగా ఉండడానికి కొందరిని ఎన్నుకుంటాడు. మనుషుల కంటికి కనబడకుండా వాళ్ళు పనిచెయ్యాలి. కాని వాళ్ళ పనిని పరలోకం అంతా తేరిపారజూస్తుంటుంది. వారు పరిశుద్దాత్మచేత బలపర్చ బడతారు.
యేసు ప్రభువు బహుమానాలిచ్చే రోజు వస్తుంది. ఆయన పొరపాట్లేమీ చెయ్యడు. నీకు అంత మంచి బహుమానం ఎలా దొరికింది అని మనుషులు ఆశ్యర్య పోతారు. ఎందుకంటే నీ పేరు వాళ్ళెప్పుడూ వినలేదు మరి.
పోరాటంలో నువ్వెక్కడ నిలిచావో
అదే నీ స్థానం
ముఖాన్ని తిప్పేసుకోకు
ఇక్కడ నాకేం పని లేదనుకుని
దేవుడు ఎందుకోసమో ఉంచాడు నిన్నక్కడ
అది ఎక్కడైనా దానికోసం నిన్నెన్నుకున్నాడు
నమ్మకంగా పనిచెయ్యి
కవచం ధరించు విశ్వాస పాత్రుడిగా ఉండు
పనిలోనైనా విశ్రాంతిలోనైనా
ఏది ఏమైనా సందేహాలు మాత్రం మాను
దేవుని త్రోవలు శ్రేష్టం
పోరాటంలో గాని, విశ్రమంలోగాని
నీ యజమాని నీకిచ్చిన పని ఇదే
నమ్మకంగా చెయ్యి దీన్ని.
విశ్వాసులంతా గుమికూడిన కూటాలనూ, ప్రోత్సాహపరిచే శిఖరాగ్రాలను సహాయకరమైన వ్యక్తుల సహవాసాన్నీ వదలడానికి సంకోచించనక్కరలేదు. ఎమ్మాయికి ప్రయాణం కట్టవలసివస్తే, లేక మాసిదోనియ తీరానికి సువార్త వ్యాప్తికి వెళ్ళవలసి వస్తే సందేహమక్కరలేదు. ఎందుకంటే దేవుడు మనల్నక్కడ ఉంచబోతున్నాడని మనలో నిశ్చయ ఉంటుంది. మనం మన దైనందిన వ్యవహారాల్లో మునిగి ఉన్నప్పుడు, ఉన్నట్టుండి ఆయన, మనల్ని సరిహద్దు ప్రాంతాలకి తనకోసం వాటిని గెలిచి స్వాధీనపరచుకొమ్మని పంపిస్తాడు.