Skip to Content

Day 166 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

26 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెను (ఆది 41:52).


బయట వర్షం కురుస్తోంది. ఒక కవి కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తున్నాడు. వర్షపు చినుకులు కుండపోతగా పడుతూ భూమిమీద దరువులు వేస్తున్నాయి. అయితే కవి కంటికి కనిపించే వాన చినుకులకంటే మరెన్నెన్నో ఊహలు అతని మనసులో మెదులుతున్నాయి. తడిసిన నేలలోనుండి పుట్టుకొచ్చే వేలకొద్దీ పూలనీ, అవి వికసించి ఆ ప్రదేశాన్నంతటినీ రంగులతోను, సువాసనతోను నింపడం అతను చూస్తున్నాడు. అతని పెదవులపై ఓ పాట ఉదయించింది.


నాకైతే ఈ వాన వానకాదు, పూలవానే

పడుతున్న ప్రతి చినుకులో, కమ్ముతున్న ప్రతి మబ్బులో

కొండల్ని కప్పే పూల పయ్యెదనే చూసాను

ధారగా పడుతున్న గులాబీలనే చూసాను


ఏమో, దేవుడు శిక్షిస్తున్న కొందరు దేవుని పిల్లలు ఇప్పుడు అంటున్నారేమో, దేవా ఈ రాత్రి నా మీద ఇంత వాన కురిపిస్తున్నావెందుకు?


"శోధనలు, నేను భరించగలిగినంతకంటే కష్టమనిపించే వర్షాలు, నేనను కున్నవన్నీ తారుమారైపోతుంటే నిరాశలు జల్లుగా నామీద కురుస్తున్నాయి. ఎడబాటులు, వియోగదుఃఖాలు ఏకధారగా పడుతూ ఆ శ్రమల తీవ్రతకి నా హృదయం కంపించి పోయేలా చేస్తున్నాయి. బాధల వాన చినుకులు నా ఆత్మపై చాలా జోరుగా కురుస్తున్నాయి."


నువ్వంటున్నది పొరపాటు. నీ మీద పడేది వాన కాదు. ఆశీర్వాదాల వానే ఇది. నువ్వు కేవలం నీ పరమతండ్రి మాటని నమ్మితే నిన్ను బాధించే వర్షమే నీలో ఆత్మీయ పుష్పాలు పూసేలా చేస్తుంది. శిక్షపొందని ప్రశాంతమైన నీ గత జీవితంలో ఎన్నడూ లేనంత పరిమళమూ, సౌందర్యమూ గల్గిన పూలు పూస్తాయి.


నీ కంటికి వర్షం కనబడుతోంది నిజమే. పువ్వులు కనిపించడం లేదా. శోధనల్లో చిక్కుకుని బాధపడుతున్నావు. కాని ఆ శ్రమలలో నీ జీవితపు తోటలో వికసిస్తున్న విశ్వాస పుష్పాలకోసం దేవుడు చూస్తున్నాడు.


బాధలకు జడిసి దూరంగా పారిపోతావు. అయితే బాధలుపడే నీ తోటివాళ్ళ కోసం, నీ బాధల్లో నీలో పెరిగే ఆ సానుభూతి పుష్పాలకోసం దేవుడు చూస్తున్నాడు.


తీవ్రమైన వియోగబాధ వల్ల నీ హృదయం వాడిపోతుంది. కాని ఆ దుఃఖం నీలో తెచ్చిన లోతైన సమృద్ధి జీవాన్ని దేవుడు చూస్తున్నాడు.


నీ మీద కురిసేవి కడగండ్లు కావు. వాత్సల్యం, ప్రేమ, దయ, సహనం ఇంకా ఆత్మకి సంబంధించిన ధన్యకరమైన వేలకొద్దీ పూలు వానలా కురుస్తున్నాయి. ఇహలోకంలోని మరీ యే స్థితిగతులూ, సౌకర్యాలూ ఇవ్వలేనంత, ఆత్మీయ సంపదను నీ అంతరంగానికి చేకూర్చిపెడతాయి.


గాలివానలో గీతాలు


స్థంభించిన గాలిలో వీణె ఒకటి ఉంది.

ఓ బాటసారి బరువు మోస్తూ వచ్చాడు

ఆ మౌన వీణలో రాగాలు పలికించాలని

ఆశగా వేళ్ళతో మీటాడు

రాగం పలకలేదు

గాలి తిరిగింది, మేఘం ఉరిమింది


విపంచి సవరించుకుంది

గాలివానలో దేవుని వేళ్ళు కదిలాయి

ప్రకృతి గొంతెత్తి పాట పాడింది

గాలి ఈలలువేసి సంగీతాలు పాడింది

అభయమిచ్చే గొంతుతో

వినిపించాడు దేవుడే తన ప్రేమగీతాన్ని.


Share this post